మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం..

మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం..

ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీస్ జారీ,
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, మెనూ అమలు విధానంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన మార్గదర్శకాల ప్రకారం మెనూలో భాగంగా విద్యార్థులకు కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే పాఠశాలలో ఈరోజు మాత్రం విద్యార్థులకు వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నట్లు కలెక్టర్ గమనించారు. నిర్ణయించిన కామన్ డైట్ మెనూను ఎందుకు పాటించలేదని పాఠశాల సిబ్బందిని కలెక్టర్ ప్రశ్నించారు.

అదేవిధంగా విద్యార్థులకు వడ్డించిన అన్నం, సాంబార్ నాణ్యత సరిగా లేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ పసుపు నీళ్ల లాగా నాణ్యత కూడా బాగోలేదని గుర్తించిన కలెక్టర్ పాఠశాల హెడ్‌మాస్టర్ భాస్కర్ రెడ్డి మరియు వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ పిల్లలకు ఇలాగే భోజనం పెడుతున్నారా? అన్నం ఎలా ఉంటుందో కూడా తెలియదా? అంటూ ఉపాధ్యాయులను కలెక్టర్ మందలించారు. జిల్లాలోని తను అనేక పాఠశాలల్లో తాను మధ్యాహ్న భోజనం చేసి పరిశీలించినప్పటికీ, ఇంత నాసిరకం భోజనం ఎక్కడా తినలేదని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కానీ ఇలాంటి నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఎందుకు మిమ్మల్ని విధుల నుండి సస్పెండ్ చేయరాదని కలెక్టర్ ప్రధానోపాధ్యాయుడిని, ఉపాధ్యాయురాలని ప్రశ్నించారు.

విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందేలా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. రోజువారీ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, మధ్యాహ్న భోజన వంట ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని హెడ్‌మాస్టర్‌కు ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల హెడ్‌మాస్టర్ భాస్కర్ రెడ్డి మరియు ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ కు ఫోన్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన మరియు పౌష్టికాహారం అందేలా అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ..‌‌.., పదవ తరగతి పరీక్షలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని ఈ నెల రోజులు సమయాన్ని వృధా చేయకుండా ప్రతి పరీక్షకు భయం లేకుండా హాజరై మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థులపై కలెక్టర్ ఆరా తీశారు.

ఈ విద్యా సంవత్సరం 128 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివరించారు. పదో తరగతి విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల మార్కులను ఇప్పటివరకు ఎందుకు అందించలేదని కలెక్టర్ ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ వెంట నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ బాదాం రమేష్, నాగర్ కర్నూల్ ఆర్డిఓ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Leave a Reply