కర్నూలులో తహశీల్దార్ కేడర్‌లో తాత్కాలిక పదోన్నతులు..

కర్నూలులో తహశీల్దార్ కేడర్‌లో తాత్కాలిక పదోన్నతులు..
- 9 మంది డిప్యూటీ తహశీల్దార్లకు అదనపు బాధ్యతలు.
- ఖాళీ స్థానాల్లో నియామకాలు . .
- కలెక్టర్ ఉత్తర్వులు జారీ.
- సీనియారిటీపై హక్కులు లేవు, .
- తాత్కాలికమే నియామకం.
- పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కీలక నిర్ణయం.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కోసం తహశీల్దార్ కేడర్‌లో తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ఏ. సిరి ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. REV-ASECOPRM/1/2026-SA(A1)-COLLKRNL సంఖ్యతో విడుదలైన ఈ ఉత్తర్వుల ప్రకారం, 9 మంది డిప్యూటీ తహశీల్దార్లను తాత్కాలిక ప్రాతిపదికన తహశీల్దార్లుగా పదోన్నతి ఇచ్చి, జిల్లాలోని ఖాళీ స్థానాల్లో నియమించారు.
జిల్లా కలెక్టర్ గమనిక ఆదేశాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పరిపాలనలో వేగం, ప్రజా సేవల అందుబాటు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమని స్పష్టం చేస్తూ, ఎటువంటి సీనియారిటీ హక్కులు కల్పించబడవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ క్రింది అధికారులకు బాధ్యతలు
బత్తుల నారాయణ రెడ్డి (బనగానపల్లి)ను హలహర్వి తహశీల్దార్‌గా, జె. మల్లికార్జున రెడ్డి (ఔకు)ను ఆస్పరి తహశీల్దార్‌గా నియమించారు. బైలుప్పల నాగరాజు (కోడుమూరు)ను అదే మండలంలో కొనసాగించగా, పెరుమాళ్ల రవిచంద్ర (అర్బన్ కర్నూలు)ను కౌతాళం తహశీల్దార్‌గా నియమించారు. సనా మురళీ మోహన్ (ఆలూరు)ను చిప్పగిరి తహశీల్దార్‌గా, టి. అబ్దుల్ వహాబ్‌ను ఆదోని-1 కార్యాలయంలో విధులు నిర్వర్తించేందుకు, నందవరం తహశీల్దార్‌గా డిప్యూటేషన్ ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించారు. ఎం. లక్ష్మీరాజును హొళగుంద తహశీల్దార్‌గా, పి. వలి బాషాను పెదకడుబూరు తహశీల్దార్‌గా (ఎలక్షన్ విభాగం, ఎమ్మిగనూరు), కె. రవీంద్రనాథ్ రెడ్డిని మద్దికేర (ఆదోని పరిధి) తహశీల్దార్‌గా నియమించారు.
తాత్కాలిక నియామకాలపై స్పష్టత
ఈ నియామకాలు పూర్తిగా అద్‌హాక్ ప్రాతిపదికన మాత్రమే అమల్లో ఉంటాయని, ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఎప్పుడైనా తిరిగి పాత హోదాకు మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదే విధంగా, ఈ పదోన్నతుల ద్వారా తహశీల్దార్ హోదాకు సంబంధించిన వేతన ప్రయోజనాలు అందుబాటులో ఉండవని, డిప్యూటీ తహశీల్దార్ కేడర్‌కు సంబంధించిన వేతనమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లా రెవెన్యూ అధికారి సి. వెంకట నారాయణమ్మ కలెక్టర్ తరపున విడుదల చేశారు.
