వేములవాడ (రాజన్న సిరిసిల్ల జిల్లా): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం దర్శనాలు నిలిపివేశారు. రాజన్న ఆలయంలో జరుగుతున్న విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా ఆలయ దర్శన వేళలు, మొక్కుబడుల నిర్వహణలో తాత్కాలిక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ప్రకటన జారీ చేశారు. రేపటి (12-10-2025) నుంచి ప్రధాన ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ప్రధాన ఆలయంలో జరిగే నిత్యకైంకర్యాలు (ఏకాంత సేవలు) సాధారణ విధంగా, అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
భక్తులు తమ మొక్కుబడులు, ఆర్జిత సేవలను తీర్చుకునేందుకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. కోడె మొక్కుబడి, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమ పూజ, నిత్య కల్యాణము, చండీ హోమం వంటి అన్ని ప్రధాన ఆర్జిత సేవలను ఇకపై శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్దే నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆలయ విస్తరణ పనులకు భక్తులు సహకరించాలని.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చి మొక్కుబడులు తీర్చుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తి చేశారు. ఈ అభివృద్ధి పనులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతోనే చేపట్టబడినట్లుగా ఆయన స్పష్టం చేశారు.