సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…

సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…
చక్రస్నానం, వసంతోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతి..
పుష్పయాగం, డోలోత్సవంతో మహోత్సవాలు…
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : సీతానగరంలోని విజయకీలాద్రిపై వెలసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ మద్వీరామాంజనేయస్వామి, శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతూ సోమవారం తో ముగియనున్నాయి. చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం నిత్యార్చన, నిత్య హోమ బలిహరణాదులు నిర్వహించగా, అనంతరం చూర్ణోత్సవం, వసంతోత్సవం, అవబృందోత్సవం భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉత్సవాల్లో భాగంగా కృష్ణానదిలో నిర్వహించిన చక్రస్నానంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం పూర్ణాహుతి, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు.

సాయంత్రం నిత్యార్చన, హోమ బలిహరణాదుల అనంతరం బ్రహ్మోత్సవాలకు ముగింపు సూచికగా ధ్వజావరోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీ పుష్పయాగం, సాయంత్రం 6:30 గంటలకు ద్వాదశి ప్రదక్షిణలు, డోలోత్సవం, పవళింపు సేవలతో ఈ బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా ముగియనున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
