ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు..

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు..

కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు విశేష పుష్పార్చన
కలెక్టర్ లక్ష్మీశ దంపతుల ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండవ రోజు పూజా మండపంలో జగన్మాతకు విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పుష్పార్చనలో అమ్మవారిని కనకాంబరాలు, గులాబీ పూలతో అద్భుతంగా అలంకరించి అర్చించారు.

పుష్పాల సుగంధాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సేవను దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పరవశంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ దంపతులు అమ్మవారికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదే రోజున డా. లక్ష్మీశ విజయవాడ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఒకవైపు పరిపాలన బాధ్యతలు చేపడుతూ, మరోవైపు అమ్మవారి సేవలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తృ మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply