Telangana – మరో ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. ఏడుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో పాటు కలిపి విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 10కి వాయిదా వేసిన ధర్మాసనం
ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం జతచేసింది. పాత పిటిషన్‌తో కలిపి కేటీఆర్ పిటిషన్‌పై విచారణ చేస్తామని చెబుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై రెండు రోజుల క్రితం సుప్రీంలో విచారణ జరుగగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడాన్ని తప్పుపట్టింది. ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో గట్టిగా ప్రశ్నించింది.