Telangana | ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్త‌ర‌ణ – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన కిశోర్‌, హైద‌రాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు.

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌-ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24269 కోట్ల అంచనాలతో డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచ‌ర్‌గా ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏ ను (ఫ్యూచర్ సిటీ డెవెలప్​మెంట్​ అథారిటీ)ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని చెప్పారు.

మూసీ పునరుజ్జీవనంపై స‌మీక్ష

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూ ఘాట్‌ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌తో పాటు మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్‌పైన బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని చెప్పారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలి. సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఉండే విధంగా డిజైన్లను ఎంచుకోవాలి. ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్లు ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలి.

సింగపూర్‌లోని ‘గార్డెన్స్ బై ది బే’ ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలి. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, థీమ్ పార్క్, అంఫీ థియేటర్‌తో కూడిన డిజైన్లు ఉండాలి. బోటింగ్‌తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలి. ట్యాంక్‌లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలి. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్‌ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలి.

మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు రూపొందించాలి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించి ఆ మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలి. మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలి. ఇక్కడి అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలి. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అభివృద్ధి ప్రతిపాదనలన్నీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉండాలి… అని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , శ్రీనివాస రాజు , మున్సిపల్ శాఖ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *