జీజీహెచ్‌లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

జీజీహెచ్‌లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం
కర్నూలు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల థీమ్ “జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్” గా నిర్ణయించడంతో, ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుధ్యంపై అవగాహన పెంపొందించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి క్యాజువల్టీ విభాగం నుండి ప్రారంభమైన భారీ అవగాహన ర్యాలీ గైనెక్ వార్డు వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు బ్యానర్లు ప్రదర్శిస్తూ “మన చెత్త – మన బాధ్యత” అనే నినాదాలతో రోగులు, వారి సహాయకుల్లో పరిశుభ్రతపై చైతన్యం నింపారు. ర్యాలీ అనంతరం గైనెక్ వార్డు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాలను పచ్చదనంతో నింపి, శుభ్రమైన, ఆహ్లాదకర వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఈ ప్లాంటేషన్ చేపట్టారు. ఇదే సందర్భంలో ఎమర్జెన్సీ వార్డు ముందు తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర బయో-మెడికల్ వ్యర్థాలను వేర్వేరు రంగుల డబ్బాల్లో వేరు చేసి వేయడం యొక్క ప్రాముఖ్యతను నర్సింగ్ విద్యార్థులు, శానిటేషన్ సిబ్బంది ప్రజలకు ప్రత్యక్షంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా. లక్ష్మీ భాయి, CSRMO డా. పద్మజ, డిప్యూటీ CSRMO డా. పద్మజ, అడ్మినిస్ట్రేషన్ అధికారులు సింధు సుబ్రహ్మణ్యం, డా. వెంకట రమణ, డా. శివ బాల, డా. కిరణ్ కుమార్, డా. సునీల్ ప్రశాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రి భాయి తదితరులు పాల్గొన్నారు.
అలాగే నర్సింగ్ విద్యార్థినిలు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
