ముగిసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్

ముగిసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్

ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు జీఎస్టీ2.0
కేంద్ర మంత్రి కింజార‌పు రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, అక్టోబర్ 19(ఆంధ్రప్రభ బ్యూరో) : జీఎస్టీ 2.0 తో మంచి సంస్కరణలు అమలు అయ్యాయని కేంద్ర పౌర విమానయన శాఖ‌మంత్రి మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో గడిచిన కొద్ది రోజులుగా సిక్కోలు ఉత్సవ్ పేరుతో జరుగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో జీఎస్టీ 2.0కు ప్రధాని మోదీ ఆలోచన చేశారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ నెలరోజుల్లో అనేక మార్పులను చూశామని స్పష్టం చేశారు. దేశంలో ప్రతీ ఒక్కరు జీఎస్టీ 2.0 లబ్ధిని పొందారు అని తెలిపారు. లక్ష కోట్ల రూపాయలు ఈ నెలరోజుల్లో దేశ వ్యాప్తంగా ఈ లబ్ధి ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు అన్నారు. జీఎస్టీ 2.0 విప్లవాన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నే వినియోగించుకుంటోందని.. అందుకే ప్రధాని మోదీ కూడా మన రాష్ట్రంలో కర్నూలులో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. మరోసారి మోదీ ప్రసంగానికి.. అందులో ముఖ్యమైన జీఎస్టీ ప్రసంగానికి తెలుగు అనువాదం చెయ్యడం ఆనందంగా ఉందని అన్నారు. జీఎస్టీ 2.0 ఫలాలను క్షేత్ర స్థాయిలో మరింతగా తీసుకువెళ్లేందుకు రాష్ట్రంలో అందరూ ప్రయత్నించాలన్నారు.


స్వదేశీ వస్తువుల వాడకం..


జీఎస్టీ 2.0 లబ్ధికి జోడించాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో వీలున్నంత ఎక్కువగా టార్గెట్ పెట్టుకోవాలని.. మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వాడకం అలవాటు చేసుకోవాలని అన్నారు. హడావిడి ఎక్కువగా ఉన్న వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని.. మెడ్ ఇన్ ఇండియా వస్తువుల మార్కెటింగ్ తక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం అని అన్నారు. జీఎస్టీ 2.0లో దాగి ఉన్న రహస్యం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడమే అని.. భారతీయుడిగా అది మన బాధ్యత అని గుర్తు చేశారు. భారతీయుని చెమటతో తయారైనా ప్రతీ వస్తువు మేడ్ ఇన్ ఇండియా గానే పరిగణించాలని అన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతీయుల మార్కెట్ కూడా చాలా విశాలమైనదని.. ఈ తరహా ప్రోత్సాహం అందిస్తే మరింత వృద్ధి చెందుతుందని తెలిపారు. ఆటో మొబైల్ రంగంలో జీఎస్టీ 2.0 అనేక మార్పులు తీసుకువచ్చిందని.. శ్రీకాకుళం జిల్లాలోనే జీఎస్టీ.2.0 తొలి నాళ్లలో రెండు వేలకు పైగా వాహన విక్రయాలు జరగడం శుభసూచకం అని అన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా ఈ నెల రోజుల్లో 8000 కోట్ల రూపాయలు తెలుగువారికి ఆదా అయినట్టు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కు.. కేంద్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు తొడవుతున్న శుభ సందర్భంలో మన రాష్ట్రంలో కూడా విశేష ఆర్థికాభివృద్ధి సాధించడం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన స్టాళ్ల‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఒక్కో వస్తువులో గతంలో ధర ఎంత ఉండేది.. ప్రస్తుత వ్యత్యాసం ఎంత అనేది అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన క్రాకర్స్ షో ను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్, జిల్లా స్థాయి అధికారులు, వ్యాపార వర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply