sunita williams | మీ ప‌ట్టుద‌ల‌కు సెల్యూట్ : సీఎం చంద్ర‌బాబు

వెల‌గ‌పూడి : నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి 286 రోజుల తర్వాత ఎట్టకేలకు వారిద్దరూ పుడమిపైకి తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. సునీతా, విల్మోర్ ప్రయాణం ఆదర్శప్రాయమైన మానవ సంకల్పం, జట్టు కృషిని చూపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.

వారిద్దరూ తిరిగొచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వ్యోమగాముల బలం, పట్టుదలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. సునీత విలియమ్స్, బారీ విల్మోర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీ శాస‌న‌స‌భ అభినంద‌న‌లు..
మరోవైపు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బృందానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది. సునీతా విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా తిరిగి రావటం శుభపరిణామమని శాసనసభ స్పీకర్ అన్నయ్యపాత్రుడు అన్నారు. సునీతకు ఇది మూడో అంతరిక్ష యాత్రని, ఇప్పటివరకూ ఆమె 608 రోజులు అంతరిక్షంలో గడిపిన‌ ఘనత సాధించారని చెప్పుకొచ్చారు. శాస్త్రీయ పరిశోధనలపై సునీతకు ఉన్న ఆసక్తి, పట్టుదల.. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయని ఆమె ధైర్య సాహసాలు ప్రశంసనీయమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *