Sunday magazine | ఆదివారం సంచిక 28 సెప్టెంబర్ 2025

ఈ సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.

  • శత విజయాలకు నాంది – ముఖపత్ర కథనం 1 | వారణాశి వెంకట సూర్య కామేశ్వర రావు
  • చెప్పుకోండి చూద్దాం
  • ఒక్కేసి పువ్వేసి సందమామ – ముఖపత్ర కథనం 2 | తుమ్మల కల్పనా రెడ్డి
  • హరే శ్రీనివాస ! – పుస్తక సమీక్ష | జీడిగుంట వెంకట్రావు
  • జాను అనే నేను… నా స్నేహితురాళ్లు – పుస్తక సమీక్ష | మల్లారపు నాగార్జున
  • బాధ్యత – కథ | మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
  • ఇదీ వరస – కార్టూన్
  • అనుబంధాల ఆలంబన – కథ | రాము కోలా
  • చెప్పుకోండి చూద్దాం – స‌మాధానాలు

1.శత విజయాలకు నాంది

ప్రతి యుగంలోనూ సురాసురుల ఘర్షణ తప్పదు. అనుక్షణం ప్రతి మనిషిలోను ఈ మంచి చెడుల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మంచిపై చెడు ఎప్పుడూ విజయం సాధించలేదు. సృష్టి ధర్మమే దుష్ట శిక్షణ-శిష్టరక్షణ. ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఏ చర్య అయినా అధర్మమే.
ఎదుటి వ్యక్తి నైనా, జీవినైనా ఏ విధంగా బాధకు గురిచేసినా, అది అధర్మమే. త్రిగుణాలలోని రజో, తమో గుణ ప్రభావంతో అసుర ప్రవృత్తి ప్రబలి పోతుంది. రాక్షస గుణం తయారవుతుంది. అసుర సంహారమే దైవ ధర్మం. అసుర శక్తుల ప్రభావం పెరిగితే అది సృష్టి వినాశనానికి కారణం అవుతుంది. అందుకే అనేక అవతారాలను కల్పన చేసి అసుర సంహారం చేసి తీరతాడు.

అలా సృష్టించిన మహావతారమే శక్తి రూపిణి దుర్గాదేవి.
త్రిమూర్తులు, సకల దేవతలు వారి వారి సర్వశక్తులు ధారపోశారు, సింహవాహిని అయిన దుర్గాదేవి మహిషుడు తదితర రాక్షసులను సంహారం చేసింది. ఇదంతా పౌరాణిక చరిత్ర.
దీని నుండి ప్రభావితం కావడానికి నేడు మానవులు ఆ శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను అనేక నామాలతో రూపాలలో ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం స్త్రీ శక్తి సత్వ రజో తమో గుణాలకు ప్రతీక. స్త్రీ అనే పదం లోనే త్రిగుణ శబ్దం మిళితమై ఉంది.

శరదృతువు ప్రారంభంలో దేవీ నవరాత్రులు మొదలవుతాయి. భారతదేశం వేదభూమి. ఈ దేవీ ఆరాధన దేశమంతటా వివిధ పద్ధతులలో జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో గౌరీదేవిని ఆరాధించడంలో బతుకమ్మ ఉత్సవాలు, దుర్గామాతను అర్చించడంలో నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. దేవీ అనగానే ప్రతి స్త్రీని దైవీభావనతో మనసా వాచా కర్మణా గౌరవించే అభ్యాసం ప్రారంభించడం చాలా ముఖ్యం. ఆడంబరంగా చేసే నవరాత్రులు బతుకమ్మ నవదిన సంబరాల వల్ల ఈ సృష్టికి మూలంగా భావించే స్త్రీ మూర్తికి శాశ్వతమైన పవిత్ర స్థానం కలగాలి.

ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు బతుకమ్మ జరుగుతూనే ఉన్నాయి. నవరాత్రులు, బతుకమ్మలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీని ఒక ఆటబొమ్మలా భావించి హత్యలు, మానభంగాలు కూడా జరుగుతున్నాయి. మహిషాసురులు, తారకాసురులు, రావణాసురులు ప్రబలిపోతూనే ఉన్నారు. మహిషాసుర మర్దనిగా దుర్గాదేవి రూపాన్ని తలుచుకుంటేనే భయం కలుగుతుంది. ఈ సమాజంలో స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపిణిగా మారినప్పుడే అసురుల ఆగడాలు ఆగుతాయి. అదే సమయంలో ఒక మాతృమూర్తిగా, ఒక పవిత్రమైన సోదరిగా, అలరించే భార్యగా, ప్రతి స్త్రీ తన స్థానాన్ని ఒక దివ్యమైన పీఠంపై ప్రతిష్టించుకోవాలి. ఈ పవిత్ర భారతదేశ సంస్కృతిలో స్త్రీ మూర్తికి అపారమైన గౌరవ స్థానం ఉంది. కుటుంబ వ్యవస్థలో స్త్రీలదే ప్రముఖ స్థానం. ఒక మనిషి విజయం వెనుక కచ్చితంగా స్త్రీ శ్రమ ఉంటుంది.

“యా దేవీ సర్వభూ తేషు శక్తి రూపేణ సంస్థితా”
ప్రతి ప్రకృతి అంశలోను దేవి శక్తి రూపంలో ఉంటుంది. ఈ సృష్టిలో బీజాలు అనేకం కానీ సుక్షేత్రం లేకపోతే అవిమొలకెత్తవు. అలాగే దైవాంశ సంభూతులైన దేవతా సమానులైన మానవ జాతి సృజించబడాలంటే పవిత్రమైన క్షేత్రం ఆవశ్యం. ఆ క్షేత్రమే స్త్రీ మూర్తి. సహనానికి ప్రత్యేకత స్త్రీ. అదే సమయంలో అసుర ప్రవృత్తిని సంహరించే అసహనం కూడా అదే స్త్రీ మూర్తిలో ఉందనేది మరచిపోకూడదు. అందుకే మగువ అంటే మధుర భావనే కాదు, పవిత్రమైన ఆరాధనా సంకల్పం కూడా అవసరం.

భారతీయ పండుగలన్నీ ఒక అంతర్లీన ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ప్రకృతిని కాపాడితే ధర్మాన్ని నిలబెట్టినట్లే. బతుకమ్మలను తంగేడు, బంతి, చామంతి, గునుగు పూలతో తమ మృదువైన చేతులతో మహిళలు అందంగా తీర్చిదిద్ది, దానిపై ఒక వేదిక ఏర్పాటు చేసి, పసుపుతో గౌరీదేవిని నిలబెట్టి, ఆటపాటలతో అర్చిస్తారు. ఆ పుష్పాల రంగులు-సువాసన ఒక మధురమైన, పవిత్రమైన అనుభూతిని కల్పిస్తుంది.

ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ ఐదవరోజున అలిగి, తొమ్మిదో రోజున సద్దులతో సంతృప్తి చెందుతుంది.ఆ సుందర బతుకమ్మ స్వరూపాలను నదులలోను చెరువులలోను నిమజ్జనం చేస్తారు. వరద నీళ్లతో నిండిన జలాశయాలు, నదులు పసుపు, గునుగు పూలతో శుద్ధి చేయబడతాయి. ఇక ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలు పవిత్రమై, మనకు పుష్టిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. దసరా అంటే సరదా తో పాటు అనేక బాధ్యతలను సమాజంలో ప్రతి ఒక్కరికి కల్పిస్తుంది. చేతివృత్తుల వారిని, జానపద కళాకారులను పోషించి ప్రోత్సహించడం విధి. భారతీయ పండుగలు అంటేనే సంపదల పంపిణీ. ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం ప్రకృతిని సంరక్షించుకోవడం. ఇక దసరా అంటే చెడుపై మంచి విజయం సాధించడం. అధర్మం అనే చీకటిని పారద్రోలి ధర్మమనే వెలుగును నింపడం. విజయదశమి శత విజయాలకు నాంది. అందుకే ప్రతి ఒక్కరూ అహంకారం వదిలి మంచిలోని ఆంతర్యాన్ని అవగాహన చేసుకుని సమాజంలో ఎవరికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను, పవిత్రతను వారికి ఇచ్చి మనిషిగా పరిపూర్ణమవ్వాలి.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు


2.చెప్పుకోండి చూద్దాం.


2.ఒక్కేసి పువ్వేసి సందమామ

ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయే సందమామ…

“ఇద్దరక్క సెల్లేండ్లు ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో…”
ఆ పాటలోనే అక్క చెల్లెండ్ల పామురాలు అగుపిస్తాయి…
మన ఉనికికి మూలం ప్రకృతి…
ఆ ప్రకృతికి సంపూర్ణ ఆరాధనే బతుకమ్మ పండగ…
ఆ పండగచ్చిందంటే సాలు ఎక్కడెక్కడనో ఉన్న
అడిబిడ్డలు వారం ముందే పుట్టింటికి వస్తరు….
అటకెక్కిన తాంభాలం కిందికి దిగితే…
అత్తగారింటి నుండి ఆడిబిడ్డను పుట్టింటికి తోల్కచ్చేదే “బతుకమ్మ పండగ”..
ఒక ఆడదాని జీవితం మొత్తం సూసుకుంటే ఆమె సంతోషంగా ఉన్న దినాలల్ల ఈ బతుకమ్మ పండగ ఒకటి…ఆమె దుఃఖమంత ఆ పదొద్దులు సప్పట్ల నడుమ మరిసి ప్రకృతిల లీనమైపోతది….
బతుకమ్మ పండగంటే బంధాలన్ని బతుకమ్మ పూల లెక్క ఒక్క దగ్గర చేరి కల్సుండుడే..
పల్లెలల్ల అయితే గుమ్మడి తీగ పారని ఇల్లే ఉండది… సిన్న గుడిసె మీద కూడ గుమ్మడి తీగ పారిత్తే పచ్చని తీగ, పసుపు రంగు గుమ్మడి పూలు ఎంత ముద్దుగుంటయో…
అప్పుడప్పుడే సలి మొదలయ్యే కాలం కాబట్టి పొద్దుగాల పువ్వుల మీద మంచు సుక్కలు బొట్టు పెట్టినట్లే ఉంటవ్…
నూతి పొంటీ గోరంట సెట్లు, పెరట్ల పట్టు సీతమ్మగుత్తులు, పాటాకుల పొంటి రుద్రాక్ష పూలు, పనగడ మొఖాన రిక్క బంతి,పట్నం బంతి నారు పోద్దురు…బతుకమ్మ పండగ అయ్యేదాకా వాటికి నీళ్ళు కట్టి వాటిని బిడ్డలోలే చూసుకుంటరు… ఎడ్లు, బర్లు పోకుండా ముళ్ళ కంపను ఏద్దురు….
ఇక ఊరవతల తంగేడు, గునుగు ఒక వనమొలే కనిపిస్తది…ఇక కట్టమీంచి పోతాంటే దళ్ళ పొంటి కట్లపూలు పూస్తే ఎవరి కంట్లైన పడితే పాపం చూసినోల్లందరు బర్కపోదురు…
ఒకప్పుడు కట్లపూలు లేకపోతే బతుకమ్మ పెర్వనీకీ మనసోప్పెది కాదట.. శాత్రనికైన నాలుగు పూలు అడుకచ్చి పెర్శేదట…
ఎక్కడున్నది చెప్పండి ఈ సాంప్రదాయం…తెలంగాణ రాకముందు పండగలు కూడా బోసిపోయినట్లే ఉంటుండె
…అసలు ఎవరింట్ల నవ్వులున్నయని పండగలు, పబ్బాలు జేసుకోడానికి..ఎవరో నాలుగు పైసలునోల్లే పండగలు చేసుకునేది కానీ ఇప్పుడు అట్ల కాదు… ఉద్యమ పోరాటాలతో మూలకున్న బతుకమ్మ వాడ వాడన ఘనంగా జరుపుకుంటున్నామంటే అది ఒక తెలంగాణ ప్రజల తెగువనే గద?

బతుకమ్మ పండగ ఇంకో నాలుగొద్దులున్నదంనగ బజార్ల ఎవరైనా కనిపిస్తే సాలు. ఊల్లే అందరూ ఆగి మరీ అడిగే ప్రశ్న పండక్కి బిడ్డలచ్చిండ్రాననీ…?
మనవరాళ్ళ కోసం ఏం ఏం పలారాలు చేసినవని…?
శిబ్బి, తాంభాలం ఇవి బతుకమ్మలను పెర్సే ఇసిరెలు..
శిబ్బిల సిన్న బతుకమ్మను పేర్చితే, తాంభాలంల పెద్ద బతుకమ్మను పెర్చేది…కానీ ఇప్పుడు ఆ రెండు కూడా మూలకి వడ్డయీ…. శీకట్ల లేశీ గంప పట్టుకొని పూలన్నీ కొస్కొచ్చి నీళ్లల్లేసి పెడుదురు..తెల్లారితే సెట్ల మీద పూలు ఉంచరని అందరికంటే మా ఇంటి బతుకమ్మ పెద్దగుండాలని పోటీ పటి తీరొక్క పూలన్నీ తెంపుకొచ్చి దాసుకొందురు….ఆ రోజు వంద రూపాయలు అడిగితే ఇస్తరేమో కానీ పూలడిగితే మాత్రం లేవనే చెప్తరు…
మూడు కాళ్ళ ముసలవ్వ సుతం సద్దుల బతుకమ్మ రోజు మూడు సుట్లన్న తిరిగిపోమేది….. అంత గౌరవం బతుకమ్మ పండుగంటే … ఎంత పేదరికంల పుట్టిన ఆడబిడ్డ అయిన ఆ రోజు కైకిలికి పోయచ్చి మాపటి పొద్దుకి దుకానానికి పోయి గాజులు ఏపించుకొని, పక్కపిన్నులు, బొట్లు కొనుక్కొని ఉన్నంతల తయారయ్యి బతుకమ్మ ఆడడానికి అద్దురు…
ఆడబిడ్డలు పట్టు చీరలల్ల బతుకమ్మలెత్తుకొని గల్మ దాటుతాంటే తెలంగాణ ఆత్మగౌరవం డప్పు సప్పుల్ల మధ్య నడిచినట్లే కొడ్తది ….
ఊరంతా ఊదుబత్తుల వాసనలే, వాడవాడల సప్పట్ల మోతతో పూల నడుమ గౌరమ్మ కొలువైతే..

“రామా రామా ఉయ్యాలో రామనేసి రామా ఉయ్యాలో….
అని పాటలందుకుంటరు….
జంగెక్కి సజ్జ మీద పడున్న బతుకమ్మను ఈత సాపేసి పేర్సినం.
ఇప్పుడు హైదరాబాద్ ల ఉన్న ఆంధ్రోల్లు గుడ అంగి బతుకమ్మ ఆడుతున్నరంటే, అది
ఒకరి సంప్రదాయాలను ఇంకొకరు గౌరవించుకోవడమే…
రాష్ట్రాలు దాటి దేశ విదేశాలల్ల బతుకమ్మను నెత్తినెత్తుకుంటే
తెలంగాణ తల్లి ఎంత ముర్సిపోతందో….
తంగేడు పువ్వంటే తెల్వనోల్లే లేరు ఈ కాలాన…

బతుకమ్మ పండగంటే బతుకమ్మ ఆడుడే కాదు…
కండ్ల నీళ్ళు తీసుడు….
బస్సెక్కే దాకా బిడ్డల్ని కడుపున వెట్టుకోని సూస్కొని సాగనంపుడు….
మల్లేడాది దాకా ఆ జ్ఞాపకాలని దాసుకొనుడు…

-తుమ్మల కల్పన రెడ్డి


3.హరే శ్రీనివాస ! – పుస్తక సమీక్ష


గ్రంధం పేరు : హరే శ్రీనివాసా!
రచయిత : డా. కె.వి.రమణాచారి
ప్రచురణ : ఎమెస్కో బుక్స్
సమీక్షకులు : జీడిగుంట వెంకట్రావు

ఒక ప్రభుత్వోద్యోగిగా తాను చేపట్టిన ప్రతి పోస్టు లోనూ తనదైన ముద్ర వేసి ఆ పోస్టులకు వన్నె తెచ్చిన అతి కొద్దిమందిలో విశ్రాంత ఐఎఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అగ్రగణ్యులు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రమణాచారి పని చేసినప్పటి అనుభవాలను “హరే శ్రీనివాసా” పేర గ్రంథంగా వెలువరించారు. భక్తి చైతన్య యాత్ర పేర ప్రజల వద్దకే స్వామిని తీసుకుని వెళ్లేందుకు ఉద్దేశించిన “చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర” నిర్వహణ కానీ, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించడంలో కానీ, తాను పడిన శ్రమను రమణాచారి సమగ్రంగా వివరించారు.

దేవుడికి సంబంధించిన ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఇంత కష్టపడాలా అని ఆయనకు ఆయనే ప్రశ్నించుకున్నారు. “నాకు పరీక్షలు ఆయనే పెట్టారు. ఆయనే పరిష్కరించుకున్నారు” అని వేంకటేశ్వరుని ఉద్దేశించి రమణాచారి అంటారు. తాను”అసాధ్యం” అనుకున్నది ఆ స్వామి “సుసాధ్యం ” చేయడం అద్భుతమని అంటారు.

ఈ గ్రంథానికి ముందుమాట రాస్తూ, సుప్రసిద్ధ రచయిత, విశ్రాంత ఐపిఎస్ అధికారి రావులపాటి సీతారాం రావు ఇలా అంటారు — “అదృష్టం ఉంటేనే టిటిడికి ఇవోలు అవుతారు. ఇవోలుగా పని చేసిన వారు ఏదో ఒక రూపంలో స్వామికి సేవ చేసిన వారే. శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ రాసిన “సర్వ సంభవాం” (నాహం కర్తాః హరిః కర్తా)తో పాటు శ్రీ రమణాచారి “హరే శ్రీనివాసా” తిరుమల అద్భుత అనుభవాల మాలగా చరిత్రలో నిలిచిపోతుంది” నిజమే.
అక్షర సత్యం.
మూల్యం : రూ. 150/-
ప్రతులకు
ఎమెస్కో బుక్స్ ప్రై.లి.
1-2-7, భానూ కాలనీ,
గగన్ మహల్ రోడ్, దోమలగూడ

హైదరాబాద్-500 029

33-22-2, చంద్రం బిల్డింగ్స్,
సి.ఆర్.రోడ్ చుటగుంట,
విజయవాడ-520004,
ఆంధ్రప్రదేశ్
ఫోన్ : 0866-2436643


4.జాను అనే నేను… నా స్నేహితురాళ్లు పుస్తక సమీక్ష

జాను అనే నేను, నా స్నేహితురాళ్లు
పుస్తక సమీక్ష
సమీక్షకులు : మల్లారపు నాగార్జున 
ప్రతులకు : పేట యుగంధర్.(రచయిత)
చిరునామా : చవటగుంట(గ్రామము)
వెదురుకుప్పం(పొస్ట్&మండలం)
చిత్తూర్(జిల్లా),ఏపీ-517569.

తానా మరియు మంచి పుస్తకం సంయుక్తంగా నిర్వహించిన బాల సాహిత్య నవలల పోటీలో గెలుపొందిన నవల “జాను అనే నేను, నా స్నేహితురాళ్లు”. రచయిత పేట యుగంధర్ రాసిన మొట్టమొదటి నవల ఇది.

స్త్రీలు చంద్రమండలంలో అడుగు పెడుతున్నారు. స్త్రీలు యుద్ధ విమానాలు సైతం నడుపుతున్నారు. అయినప్పటికీ, ఇప్పటికీ సమాజంలో స్త్రీలు చిన్నచూపుకు గురి అవుతున్నారు. స్కూళ్లలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యకరంగా ఇంట్లో తల్లిదండ్రులు సైతం తమకు పుట్టిన బిడ్డల్లో అబ్బాయిని కాస్త ఎక్కువగా, అమ్మాయిని కాస్త తక్కువగా చూస్తూనే ఉన్నారు. ఇదే కథాంశంతో పేట యుగంధర్ రాసిన నవల “జాను అనే నేను, నా స్నేహితురాళ్లు”. 

లింగ వివక్ష అన్నది ప్రధాన అంశం అయినప్పటికీ, ఈ నవలలో రచయిత అనేక కోణాలను స్పృసించారు. ప్రసార మాధ్యమాలను, టెక్నాలజీని పిల్లలు ఉపయోగించుకుంటే, వారు అద్భుతాలు చేయవచ్చునని చెప్పారు. పిల్లలు కేవలం చదువులకే పరిమితం కాకూడదని, ఆటపాటల వల్ల వారి మెదడు మరింత వికసిస్తుందని చెప్పారు. ఇరుకైన పట్నం ప్రైవేటు స్కూళ్ల కన్నా, విశాలమైన ఆటస్థలం కలిగిన గవర్నమెంట్ బడుల ఆవశ్యకతను వివరించారు. తమ గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నప్పుడు పదిహేనేళ్ళు కూడా నిండని జాను స్పందించిన తీరును సహజంగాను, తోటి పిల్లలకు స్ఫూర్తి నింపేటట్లుగాను రాశారు రచయిత.



5.బాధ్యత

ఉదయం ఐదు గంటలు అయింది. ఎప్పుడూ ఐదు గంటలకు కాఫీతో పలకరించే కేర్‌టేకర్ లక్ష్మీ ఇవాళ ఇంకా కనపడలేదు.
“ఏమిటి? ఏం చేయాలి అబ్బా! బీపీ మందు వేసుకోవాలి. మొహం కూడా కడుక్కోలేదు. ఏమిటో, నీరసంగా ఉంది.”

ఈ అపార్ట్మెంట్లో ఎవరు పిలిచినా పలకరు. రాజేష్ ఫోన్ తీయట్లేదు. వాడు ఇంకా నిద్ర లేచాడో లేదో.

“ఏమిటో ఈ వయసులో ఈ కర్మ!” అనుకుంటూ, అలాగే నెమ్మదిగా మంచం దిగి డేకుతూ, మొహం కడుక్కుని, నేల మీద ఉన్న స్టవ్ మీద పాలు పెట్టి, కాఫీ కాచుకుని తాగింది కాంతమ్మ.

“కొడుకు ఒక మంచి పని చేశాడు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంచినా స్టవ్, సామాన్లు కూర్చుంటే అందేలా పెట్టాడు” అని అనుకుంది కాంతమ్మ.

అయినా, ఎప్పుడూ ఈ కేర్‌టేకర్ ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్లలేదే! ఇవాళ ఏమైందో ఏమో! మార్కెట్కు గాని వెళ్ళిందా? అయినా చెప్పి వెళ్తుంది కదా! ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. పోనీ రాజేష్ కి విషయం చేద్దామంటే వాడు ఫోన్ తీయట్లేదు.

“ఏమిటో, వాడు కళాకళల మనిషి. కోపంగా ఉంటే ఫోన్ తీయడు. వాడికి కోపం వస్తే ‘అమ్మ’ అనే సంగతి మర్చిపోతాడు.”

ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాజేష్ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎంత బాగా చూసుకునే వారు! నేల మీద కాలు పెట్టనిచ్చేవారు కాదు. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.

పాపం, టీచరుగా పనిచేస్తూ కొడుకుని పెద్ద చదువులు చదివించి, ప్రయోజకుడ్ని చేసి, బాగా డబ్బున్న వాళ్ల సంబంధం వచ్చిందని మురిసిపోయి రాధని కోడలిగా తెచ్చుకున్నారు. నాలుగేళ్లు బాగానే గడిచింది.

ఆయన హార్ట్‌ఎటాక్ తో పోవడం తర్వాత, పక్షవాతం రావడం… మరి కోడలు నా వైపు చూడడం మానేసి, కొడుకుకి ఏం చెప్పిందో ఏమో, వాడు మాటలు తగ్గించేసి ఇలా కేర్‌టేకర్‌ని పెట్టి వేరు కాపురం పెట్టాడు. కొడుకు అనుకుని బాధపడుతూ, కాఫీ తాగుతూ కూర్చుని కాంతమ్మ.

ఇది అసలే అపార్ట్మెంట్. కేర్‌టేకర్ లక్ష్మీ తన బాధ్యతను చేసుకుంటూ పోతుంది. మాట మంత్రి ఉండదు. ఇంకెవరు మాట్లాడే వారెవరు ఉండరు.

ఒంటరితనం ఎంత భయంకరం! అందులో ఈ వయసులో. బయటికి వెళ్లలేదు. ఫోన్ చేసిన ఎప్పుడో గాని రాజేష్ తీసి సమాధానం చెప్పడు. ఎన్ని రోజులు ఈ కర్మ అనుభవించాలో!
“పోయిన వాళ్లు మంచోళ్ళే” అనే మాట నిజమే అనిపిస్తుంది అనుకుంది కాంతమ్మ.

అలాగే డేకుతూ, బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి, ఫ్రిజ్‌లో ఉన్న బ్రెడ్ ముక్కలు తీసుకుని తిని, మందులు వేసుకుని, మంచం మీదకు వచ్చి పడుకుంది.

జీవితం తొలి దశలో డబ్బు గురించి బాధపడేవాళ్ళం. ఇప్పుడు సరిపడే పెన్షన్ వస్తుంది. ఉండడానికి ఇల్లు ఉంది. ఆరోగ్యం మాట అలా ఉంచితే, ఇప్పుడు ఒంటరితనమే బాధిస్తోంది.

ఈ ఒంటరితనానికి మందు ఏమిటి? ఈ మందు ఎవరు ఇవ్వాలి? అయినవాళ్లే దూరంగా పెడితే, వంటరితనానికి ముందు ఎక్కడ దొరుకుతుంది? అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకుంది.

కాంతమ్మగారికి మెలకువ వచ్చి లేచేటప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది. ఆకలవుతోంది.
“ఇప్పుడు ఎలాగరా దేవుడా?” అనుకుంది కాంతమ్మ.

ఇంతలో వీధి తలుపు తాళం తీస్తున్న చప్పుడయింది. అంటే లక్ష్మీ వచ్చిందా!

“ఇప్పుడు అసలు మాట్లాడను. ఉదయం నుంచి నన్ను ఇంత బాధ పెట్టింది. పోనీ ఊరికినే చేస్తోందా చాకిరి! నెలలో మొదటి రోజునే జీతం పట్టెకిళిపోతుంది కదా! మరింత బాధ్యతారహితంగా ఉంటే ఎలా! నా పరిస్థితి తెలుసు అయినా ఇలా!” అంటూ కోపంగా అటు తిరిగి పడుకుంది.

లక్ష్మీ ఇంట్లోకి వస్తూనే,
“క్షమించండి మామ్మ గారు. మా అత్తగారికి హార్ట్‌ఎటాక్ వచ్చిందండి. పొద్దున్నే మా ఆయన ఫోన్ చేశాడు. తిని తిరిగే మనిషికే అలా వచ్చింది.

నేను ఇంట్లో లేకపోయినా, మా ఆయనకి ఇంత అన్నం ఉడకేసి పెడుతుంది ఈ వయసులో కూడా పాపం. ఏం చేస్తాం? భార్యాభర్తల ఇద్దరూ ఉద్యోగం చేస్తే గాని గడవని కుటుంబం మాది.

మాకు రోజు ఇంత సాయం చేస్తున్న ఆమెకు అలా వచ్చిందంటే, నేను తట్టుకోలేకపోయాను. పైగా నేను పెద్ద కోడల్ని. మీకు చెబుదామంటే, మీరు మంచి నిద్రలో ఉన్నారు.

మీ అబ్బాయి గారికి చెప్పాను. తొందరగా వెళ్ళిరా అని చెప్పారు. ఇప్పుడు మా అత్తకి బాగానే ఉంది. వస్తూ వస్తూ మీకు భోజనం సమయం అయిపోయిందని, ఇంటి దగ్గర నుంచి క్యారేజీ కూడా పట్టుకుని వచ్చాను.

లేవండి, అన్నం పెడతాను. రేపటి నుంచి మీకు మొహం కడిగించేసి, టిఫిన్, కాఫీ ఇచ్చి, మందులు వేసి వెళతాను. మధ్యాహ్నం ఇదే సమయానికి వచ్చేస్తాను” అని చెప్పేసరికి, ఒకసారి కాంతమ్మకి కళ్ళు నీళ్లు వచ్చేయి.

బాగా చదువుకుని డబ్బు సంపాదిస్తున్న కొడుకుకి లేని జ్ఞానం గురించి బాధపడాలా?
“రెక్కాడితే గాని డొక్కాడని” ఈ లక్ష్మీ లాంటి వాళ్లకి ఉన్న బాధ్యతకి ఆనందపడాలా?
అర్థం కాలేదు కాంతమ్మకి.

బాధ్యత ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. మనకు మనమే పరిస్థితులను అర్థం చేసుకొని, అహాన్ని దూరంగా పెట్టి బాధ్యత పంచుకోవాలి. బరువులు మోయాలి. మనిషిగా పుట్టినందుకు జ్ఞానంగా మెలగాలి.

ఆ తర్వాత కాంతమ్మ జీవితం ఆ బాధ్యత గల లక్ష్మీ చేతిలోనే ముగిసిపోయింది.


6.అనుబంధాల ఆలంబన

ఉమ్మడి కుటుంబం, ఊరి పెద్ద పరంధామయ్య గారి
గదిలో నిశ్శబ్దం తిష్ఠ వేసింది. ఆహ్వానం అందని పేరంటానికి అతిథిలా .అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ.

ఎవ్వరికీ దైర్యం చాలడం నిశ్శబ్దాన్ని ఛేదించేందుకు. అందరి చూపులు తన్నే టార్గెట్ చేస్తున్నాయని వైశాలి గ్రహించింది. కాలయాపన చేయడంతో విషయం జటిలంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది . అందుకే తన మనస్సులోని అభిప్రాయాన్ని అందరి ముందుకు తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది.

“నా అభిప్రాయాలు కుండబద్ధలు కొట్టేసినట్లు చెప్పేస్తాను. మీకెవ్వరికీ ఎటువంటి అభ్యంతరాలు లేకపోతేనే. కార్యక్రమాల ఏర్పాట్లు చేసుకోవచ్చు. లేకుంటే! విషయం ఇక్కడితో వదిలివేయడం చాలా మంచిది!”. తర్వాత చర్చించేందుకు ఆస్కారం ఉండదు” వైశాలి మాటలు గదిలో ప్రతిధ్వనిస్తూ, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూసుకు వస్తున్నాయి. శత్రుసైనికులు గుండెలను చీల్చేందుకు తూటాల్లా.
వైశాలి మాటలు వింటూ ఆశ్చర్యంతో స్తబ్ధైపోయింది వైశాలి తల్లి గారు సౌమ్య.
“నేటి సమాజంలోని ఆడపిల్లలు ఇంత నిష్కర్షగా మాట్లాడగలరా!?. ఇలా మాట్లాడుతుంది తన కూతురేనా!?” అని సౌమ్య మనసులో గర్వంతో పాటు కించిత్తు ఆశ్చర్యం … తొణికిసలాడింది .
ఈ ఉత్కంఠ భరిత క్షణానికి నేపథ్యంలోనికి మనం పరకాయ ప్రవేశం చేసేద్దాం పదండి.
**
రాత్రి ఒంటిగంటన్నర వరుకూ ప్రాజెక్ట్స్ వర్కు పనిలో లీనమై, అలిసిపోయి నిద్రిస్తున్న వైశాలిని నిద్రలేపడం సౌమ్యకు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితులలో గదిలోనికి అడుగు పెట్టింది సౌమ్య.

“వైశాలీ!లేమ్మా…
కాస్త త్వరగా పనులన్నీ ముగిస్తే బాగుంటుంది,” అంటూ కూతుర్ని నిద్ర లేపే ప్రయత్నంలో ఆదమరిచి నిద్రిస్తున్న వైశాలిని చూస్తూ , తన కలలు , ఆత్మ స్థైర్యం, పట్టుదల, నిర్ణయాధికారం—ఇవన్నీ ఇప్పుడు సజీవంగా తన కూతురులో కనిపిస్తున్నాయి అనుకుంది మనస్సులోనే.

సౌమ్య తన గతాన్ని గుర్తు చేసుకుంది.
తండ్రితో వాదించి, తన పంతం నెగ్గించుకుని, విదేశాల్లో ఉన్నత చదువులు చదివి, అక్కడే పెళ్లి చేసుకుని స్థిర పడింది. తన కూతురు వైశాలిని తల్లిదండ్రులకు దగ్గర చేయాలని నిర్ణయించుకుంది.

కారణం తను అందుబాటులో లేని లోటు వారికి తెలియకూడదని, వైశాలిని భారతదేశంలో అమ్మమ్మా, తాతయ్యల దగ్గర పెరిగేందుకు తగినన్ని ఏర్పాట్లు చేసింది.
కాలం పరుగులు తీసింది. విదేశాల్లో తన వీసా గడువు ముగింపు దశకు చేరుకుంది.

ఐదేళ్లు తర్వాత కాంట్రాక్టు ముగియగానే ఇండియా తిరిగి వెళ్ళి పోవాలని ప్లాన్ చేసుకుంటున్న సమయంలో, ఇండియాలో ఉన్న తండ్రిగారి నుండి అందిన వార్త సౌమ్య వాయువేగంతో ఇండియాకు రప్పించేలా చేసింది..
***
సాయంత్రం పెళ్లి చూపులు కార్యక్రమం.
అబ్బాయి వికాస్, అమ్మాయి వైశాలి ఒకరికొకరు నచ్చినట్టు కనిపిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతుంది అని అందరూ అనుకుంటున్న తరుణంలోనే, వైశాలి నిలబడి, అందరి దృష్టిని ఆకర్షించింది.

“మిస్టర్ వికాస్!
నేను మీతో ఒక ముఖ్యమైన విషయము చెప్పాలి.” అది ఇప్పుడు అవసరమే. ఏదైనా ముక్కుసూటిగా స్పష్టంగా చెప్పడం నా పద్ధతి.” ఎవ్వరు ఏమనుకున్నా.”

“వివాహం అనేది అనుబంధాలను పెంచేసింది కావాలి, కానీ! విడదీసేది కాకూడదు. నా తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటున్నారు. కానీ! నేను అమ్మమ్మా, తాతయ్యలు దగ్గర పెరిగాను. వారితో నాకున్న అనుబంధం చాలా అమూల్యమైనది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఒక్కరోజు కూడా దూరంగా లేను”
“ఈ పెళ్లి కోసం ఆ సంబంధాన్ని తెంచుకోలేను.”

ఆమె మాటల్లో ఆత్మాభిమానం, స్పష్టత ధ్వనిస్తున్నాయి. “నా అమ్మమ్మా, తాతయ్యా నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వారి భాద్యతలను ప్రతిక్షణం కాపాడుకుంటూ నన్ను కన్న కూతురు కంటే మిన్నగా చూసుకున్నారు అనేది నా అంతరాత్మకు తెలిసిన విషయం”.

నా తల్లిదండ్రులు ఇండియాకు తిరిగి రావడానికి, ఇక్కడ సెటిల్ అవ్వడానికి మరో ఐదేళ్లకు పైగా పడుతుంది. అంత వరకూ పెళ్లిని వాయిదా వేయమని చెప్పలేను.”

అలాగే అమ్మమ్మా తాతయ్యాను వదిలి వెళ్లడం కూడా నాకు సాధ్యం కాదు. వారు నాతోనే ఉండాలి అని కోరుకుంటున్నాను.
“నా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం మీ తల్లిదండ్రులకు ఇస్తాను. రెండు కుటుంబాలు నాకు సమానమే. ఇప్పుడు మీ అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పండి.”
అనేసి విశాల్ వైపు చూసింది వైశాలి.

వైశాలి మాటలు గదిలోని వారిని కట్టిపడేశాయి. సౌమ్య కళ్లలో గర్వం మెరిసింది. తన కూతురు తనలాగే స్వతంత్రంగా, ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పడం చూసి ఆమె గుండె ఉప్పొంగింది.

వికాస్ నవ్వుతూ సమాధానమిచ్చాడు,
“వైశాలి, మీ మాటలు నన్ను కదిలించాయి. నాకు తల్లిదండ్రులు లేరు. మీ పేరెంట్సే నా పేరెంట్స్. మీ ఇష్టమే నా ఇష్టం.” ఇది నేను మనస్పూర్తిగా తీసుకున్న నిర్ణయం.
మీ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నారు”
మీ అభిప్రాయాలు గౌరవిస్తూ మీతో జీవితం కాలం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాను “. వికాస్ మాటలు పూర్తి కాగానే గదిలో చప్పట్లు మార్మోగాయి.
నిశ్శబ్దం ఒక్క సారిగా ఉలిక్కిపడింది.

వైశాలి ఆత్మాభిమానం , అనుబంధాల పట్ల ఆమె పెంచుకున్న గౌరవం అందరినీ ఆకర్షించాయి. సౌమ్య కళ్లలో సంతోష బాష్పాలు తిరిగాయి. తన కూతురు తన కలలను, ఆదర్శాలు తనవిగా జీవించడం కుటుంబ అనుబంధాలు పట్ల అచంచలమైన నిబద్ధతను, ఆత్మ స్థైర్యాన్ని, ఆమె నిర్ణయాలలోని స్పష్టతను అద్భుతంగా ప్రకటన చేయడం చూసి ఆమె హృదయం సంతోషంతో నిండిపోయింది.

చెమర్చిన కన్నులతో సౌమ్య, వైశాలిని గాఢంగా హత్తుకుంది.వైశాలి పసిపాపలా తల్లి బాహువుల్లో ఒదిగిపోయింది.
శుభం.


చెప్పుకోండి చూద్దాం – స‌మాధానాలు

ప్రశ్న: హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పూర్వపు పేరు ఏమిటి?
సమాధానం: ముచుకుంద నది

ప్రశ్న: మూసీ నదిపై నిర్మించిన జంట జ‌లాశాలు ఏవో తెలుసా ?
సమాధానం: హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

తెలంగాణ‌లో గోదావ‌రి ఉప‌నదుల పేర్లు చెప్ప‌గ‌ల‌రా..
సమాధానం : మంజీరా, శ‌బ‌రి, కిన్నెరసాని,

దక్షిణ భారత్ లో ఎక్కువ డ్యాములు, రిజర్వాయర్లు, సరస్సులు, కాలువలు ఉన్న రాష్ట్రం ఏది?
సమాధానం : తెలంగాణ

Leave a Reply