గణపురం, ఏప్రిల్ 22( ఆంధ్రప్రభ) : విద్యార్థులు ఉన్న లక్ష్యాన్ని ఎంచుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం టీఎస్ ఆదర్శ మోడల్ ఉన్నత పాఠశాల, చెల్పూర్ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ లు తిరుపతి, అశోక్ ల అధ్యక్షతన నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, డీఈవో రాజేందర్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… నేటి విద్యార్థులే రేపటి పౌరులని, ప్రతి విద్యార్థి ఇష్టమున్న లక్ష్యంను ఎంచుకొని అందుకు కృషి చేయాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. పాఠశాలలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే నిధులు కేటాయించి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మోడల్ పాఠశాలలో రూ.15లక్షలతో సైన్స్ ల్యాబ్, రూ.15 లక్షలతో డైనింగ్ హాల్, గ్రౌండ్ లో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. రూ.80లక్షలతో పాఠశాలకు వచ్చే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తానన్నారు. చెల్పూర్ పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తానన్నారు.
ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వసతి గృహాల్లో విద్యార్థుల కష్టాలు చూసి 40శాతం మెస్ చార్జీలు, 200% కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. అనాధ పిల్లలు ఉంటే వారిని చదివించే బాధ్యతను నేనే తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. మోడల్ పాఠశాల పిఎం శ్రీలో ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ భాస్కర్, నాయకులు రేపాక రాజేందర్, మోటపోతుల శివ శంకర్, ముత్యాల రాజయ్య, వడ్లకొండ నారాయణ గౌడ్, విడిదినేని అశోక్, పోశాల మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.