రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు గుండు సున్నా

రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు గుండు సున్నా
- నేతన్నలంటే ఇంత చులకనా
- చేనేతలకు అన్యాయం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు
- రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెంకట్రాములు
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్లో చేనేత రంగానికి ప్రతిపాదించింది ఏమీ లేదని గుండు సున్నా మాత్రమేనని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు. వరంగల్ చేనేత సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లింగబత్తిని యాదగిరి , కార్యదర్శి రామకృష్ణతో కలిసి వెంకట్రాములు పాత్రికేయులతో మాట్లాడుతూ.. చేనేతను ఆదుకుంటున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు మాత్రమే చేస్తున్నది తప్ప ఆచరణలో ఏమీ లేదన్నారు. అందుకు రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు కేటాయించింది ఏమిటో చూస్తే అర్థమవుతుందన్నారు.
చేనేత మరియు జౌళి శాఖకు కలిపి 257. 56 కోట్లు ప్రతిపాదించారని, అందులో 203. 67 కోట్లు పవర్ లూమ్స్ కార్మికులకు,ఇన్సూరెన్స్ కోసం 17. 7 కోట్లు, హైండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ హెచ్ ఓ డి 15. 6 కోట్లు ప్రతిపాదించారని వీటన్నిటినీ పరిశీలిస్తే చేనేతలకు కేటాయించిందేమీ లేదన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన కేటాయింపులలో టెక్స్టైల్ రంగానికి కేటాయించినవేనని కానీ చేనేత అని ప్రకటించి మోసం చేయడం దారుణమన్నారు.
అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చేనేత రంగాన్ని విస్మరించి నిధులు కేటాయించకుండా తీరని అన్యాయం చేస్తూ చేనేతను నిర్మూలించడానికే కంకణం కట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా మిల్లు యజమానుల, బడా పారిశ్రామిక వేత్తల అనుకూల విధానాలను విడనాడి చేనేత రంగాన్ని రక్షించేందుకు బడ్జెట్ సవరించి ప్రత్యేకంగా చేనేతకే 2000 కోట్ల రూపాయలు కేటాయించి చేనేత కార్మికులకు చేతినిండా పని కలిగించి, పనికి తగిన ప్రతిఫలం అందేట్టుగాచూసి వారి అభివృద్ధికి సంక్షేమానికి నిర్దిష్టంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
తక్షణమే చేనేత సహకార సంఘాలఎన్నికలు నిర్వహించాలని టెస్కోకు పాలక మండలి ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను టెస్కో నుండి ఖరీదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని , రద్దు చేసిన చేనేత సంక్షేమ పథకాలను అన్నింటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
