నంద్యాల బ్యూరో, జులై 22 (ఆంధ్రప్రభ) : మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) అనేక చట్టాలు రూపొందించడం జరిగిందని, వాటి పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ (Dr. Rayapati Sailaja) పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా (Rajakumari Ganiya) ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమం, వైద్యారోగ్యం, జీఎస్ డబ్ల్యూఎస్ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, కళాశాల అమ్మాయిలతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ అధ్యక్షతన మహిళల సంక్షేమం, రక్షణ, భద్రత, హక్కులు, మహిళా సాధికారత అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈసందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ… మహిళా కమిషన్ బాధ్యతలో భాగంగా మహిళా భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కేవలం ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతోందన్నారు. రాయలసీమ జిల్లాల్లో విద్యార్థినీలకు మహిళా భద్రత, సాధికారతపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఆమె ఇంకా పలు కేసులకు సంబంధించిన మాట్లాడారు. అలాగే జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, అడిషనల్ ఎస్పీ జావలి మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యురాలు బేగం, ఐసీడీఎస్ పీడీ లీలావతి, సీడీపీవోలు, అనుబంధ శాఖల అధికారులు, కళాశాల యువతులు, తదితరులు పాల్గొన్నారు.
