నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాలకు రాష్ట్ర అవార్డు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో మరో ఉత్తమ కళాశాల అవార్డును అందుకునీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపాల్ గంధం బుద్ధిరాజ్ శనివారం ఈ అవార్డును స్వీకరించినట్లు జిల్లా విద్యాధికారి రవికుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో హెచ్‌ఎంటీవీ, హ్యాన్స్ ఇండియా పత్రికల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉత్తమ సేవలు, ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను ఎంపిక చేసి అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమం ఆర్టీసీ కళాభవన్‌లో జరిగింది. కార్యక్రమంలో హెచ్‌ఎంటీవీ, హ్యాన్స్ ఇండియా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ హనుమంతరావు, ఎడిటర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా ప్రిన్సిపాల్ గంధం బుద్ధిరాజ్ మాట్లాడుతూ కళాశాలకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం గర్వకారణమన్నారు. కళాశాల అభ్యున్నతికి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఈ అవార్డు కళాశాలపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ అవార్డును బోధన, బోధనేతర సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
