ఆధ్యాత్మిక నిలయం.. దివిసీమ
- జలదీశ్వర స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు
(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి ): ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయముగా, ఎంతోమంది సంగీత సాహిత్య వేత్తలకు పుట్టినిల్లుగా దివిసీమ ఎంతో ప్రసిద్ధి చెందిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా 200 మంది శిష్య బృందంతో చాగంటి కోటేశ్వరరావు ఘంటసాల గ్రామంలోని బాలపార్వతీ సమేత జలదీశ్వరస్వామి వారి దేవాలయాన్ని ఆదివారం ఉదయం సందర్శించారు. - దేవాలయాల అధికారులు, టీడీపీ నాయకులు ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు చావలి కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ జలదీశ్వర స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. ఆధ్యాత్మికతకు కేంద్రంగా దివిసీమ విరాజిల్లుతుందని తెలిపారు. శనివారం మోపిదేవి మండలంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పెద్దకల్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు.
- అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ స్వామి వారి చిత్రపటం ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఆలియా కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మొవ్వలోని శ్రీ వేణుగోపాల స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్ పర్సన్ బండి పరాత్పరరావు సీఐ ఈశ్వర రావు, ఎస్సై ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

