krishna river | లాహిరి లాహిరి లాహిరిలో..

కృష్ణా న‌దిలో జలవిహారయాత్ర

  • సోమశిల, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంకు లాంచి
  • శ్రీశైలం పర్యాటకంలో మరో కలికి తురాయి..
  • నల్లమల్ల అట‌వీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండల నడుమ లాంచ్ యాత్ర
  • పర్యాటకులకు అందుబాటులో టికెట్ ధ‌ర‌లు
  • శ్రీశైలంలో అమ్మవారి దర్శనం, వసతి ఉచితం

krishna river | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశ‌యాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా సోమశిల జలాశయం నుంచి నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంకు కృష్ణా నది ద్వారా జలవిహారయాత్ర(లాంచ్‌)కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా నది తీరంలో వెలసిన నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు సోమశిల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం వరకు లాంచ్ పర్యాటకులకు కనువిందు చేసేందుకు ప్రారంభోత్సవం చేశారు. శ్రీశైలం జలాశయంను తాగునీటి సాగునీటికే కాకుండా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు రూపొందించారు.

రాష్ట్రంలోని సోమశిల జలాశయం నుంచి నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం మధ్య లాంచ్ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. శనివారం సోమశిల జలాశయం నుంచి, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన ఈ జలవిహారయాత్రలో ప్రయాణికులు ఆసక్తి చూపటం విశేషం. సోమశిల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం వరకు 120 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వారంలో ఒకరోజు శ్రీశైలంకు లాంచ్ ప్రయాణాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సోమశిల జలాశయం నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేకంగా 66 మందితో లాంచిని ఏర్పాటు చేశారు. ఆధునిక వస్తువులతో ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. ప్రయాణికుల కోసం లైఫ్ జాకెట్లకు సిద్ధంగా ఉంచారు. సోమశిల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం టీ మరియు స్నాక్స్ ను ఏర్పాటు చేశారు. లాంచి ప్రయాణంలో పెద్దలకు పిల్లలకు కూడా రేట్లు త‌క్కువ‌గానే ఉండ‌టంతో పర్యాటకులు ఆసక్తి చూపటం విశేషం. ఈ లాంచీలో ప్రయాణం చేయటానికి పెద్దలకు రానుపోను 3వేల రూపాయలు, పిల్లలకు 2400 రూపాయలు నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలంకు ఒకే వైపున‌కు అయితే పెద్దలకు ₹2,000, పిల్లలకు 1600 రూపాయలు వసూలు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. సోమశిల నుంచి వచ్చిన పర్యాటకులకు శ్రీశైలంలో వసతి సౌకర్యంతో పాటు అమ్మవారి ఉచిత దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు కూడ శనివారం ప్రారంభం అయ్యాయని పర్యాటక అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం జలవిహారయాత్రలకు లాంచిలో ప్రయాణించేందుకు పెద్దలకు టికెట్ రేట్లు ఒకవైపు ప్రయాణానికి 2వేల రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికైతే రూ.3250గా టికెట్ రేట్లను పర్యాటకశాఖ అధికారులు ఖరారు చేశారు. పిల్లలకు 5 నుంచి 10 సంవత్సరాల వయసు వారికైతే వన్ వే అయితే రూ.1600, రెండు వైపులా ప్రయాణానికి రూ.2600గా నిర్ణయించారు. టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

కొండల నడుమ ఈ విహారయాత్ర ఎంతో ఆనందాన్నిస్తుందని పర్యాటకులు పేర్కొంటున్నారు. పర్యాటకంగా రాష్ట్రంలో మరింత ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ఈ జల విహారయాత్రను అధికారులు ప్రవేశపెట్టడం విశేషం. పర్యాటకుల భద్రతకు సంబంధించి అధికారులు ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. లాంచీలో ప్రయాణం చేసే వారి కోసం ప్రత్యేకంగా లైఫ్ జాకెట్లతో పాటు గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయటం విశేషం. లాంచ్ ద్వారా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి సాధించేందుకు భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.

ఈ ఏడాది అత్యధిక వర్షాలు కుర‌వ‌డంతో జలాశయాలు జ‌లక‌ళ‌ను సంత‌రించుకున్నాయి. రైతులు కూడా అత్యధిక పంటలు పండించేందుకు జులై 4వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయం నుంచి గంగమ్మ పూజ చేసి నాగార్జున సాగర్‌కు నీరు వదలటం విశేషం.

Leave a Reply