ఆంధ్రాలో ప్రకాశిస్తున్న ‘పీఎం సూర్య ఘర్…

ఆంధ్రాలో ప్రకాశిస్తున్న ‘పీఎం సూర్య ఘర్…
దేశవ్యాప్తంగా 32 లక్షల కుటుంబాలకు లబ్ధి
1.14 లక్షల ఇళ్లపై సౌర పలకలు
లోక్ సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రశ్నకు కేంద్రం సమాధానం
విజయవాడ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన’ (పీఎంఎస్‌జీ : ఎంబీవై ) పథకం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశిస్తోంది. పథకం వేగంగా అమలు జరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ లోక్ సభలో వెల్లడించారు. ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన’ పథకం పురోగతిపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో పాటుగా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన’ (పీఎంఎస్‌జీ : ఎంబీవై ) పథకం ద్వారా దేశవ్యాప్తంగా 32 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 66.48 లక్షల దరఖాస్తులు రాగా, 26.20 లక్షల ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయని దీనివల్ల మొత్తం 32,40,068 కుటుంబాలు ప్రయోజనం పొందాయని తెలిపారు. ఈ పథకం అమలుకు కేంద్రం ఇప్పటివరకు రూ. 17,967.46 కోట్ల సబ్సిడీని విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు . అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటివరకు 1,14,313 గృహాలపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీపాద్ యశో నాయక్ తెలిపారు.
2024 ఫిబ్రవరి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన’ పథకం ప్రారంభమైందని, పథకం ప్రారంభం నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు . ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 32,40,068 ధరఖాస్తులు రాగా రాష్ట్రంలో మొత్తం 14,72,814 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. వీటిలో 1,14,313 దరఖాస్తులకు సంబంధించి ఇన్‌స్టాలేషన్లు ఇప్పటికే పూర్తయినట్లు మంత్రి తెలిపారు.
తద్వారా 1,17,453 కుటుంబాలకు రాష్ట్రంలో లబ్ధి చేకూరిందనీ, ఈ పథకం కింద లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 734.97 కోట్లను ఆర్థిక సహాయం (సబ్సిడీ) రూపంలో ఈ ఏడాది మార్చి 20 నాటికి నేరుగా పంపిణీ చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన’ పథకం అమలు పురోగతిని జిల్లాల వారీగా పరిశీలిస్తే …పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా 1,62,506 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. సోలార్ పలకల ఏర్పాటులో గుంటూరు జిల్లా 7,767 యూనిట్లతో అగ్రస్థానంలో ఉందన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఏలూరు (7,341), కాకినాడ (6,878), కృష్ణా (6,871), విశాఖపట్నం (6,208) జిల్లాలు ఉన్నాయన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా 62 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,508 మంది రిజిస్టర్డ్ వెండర్లు సోలార్ పలకల ఏర్పాటు సేవలు అందిస్తున్నారని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ‘మోడల్ సోలార్ గ్రామాల’ను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. అనకాపల్లి జిల్లా బయ్యవరం, కాకినాడ జిల్లా తిమ్మాపురం, శ్రీకాకుళం జిల్లాలో అంపొలు, తూర్పు గోదావరి జిల్లాలో మలకపల్లి, కోనసీమ జిల్లాలో వానపల్లి, విజయనగరంలో బొడ్డం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలంపూర్, విశాఖపట్నంలో ఆర్. తాళ్లవలస, పార్వతీపురం మన్యంలో నరిపురం, ఏలూరుజిల్లాలో తాడికలపూడి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, కర్నూలు జిల్లాలో పెద్దహరివాణం గ్రామాలను మోడల్ సోలార్ గ్రామలుగా ప్రకటించడం జరిగిందన్నారు.
ఇక సోలార్ విద్యుత్ ఉత్పత్తి విషయానికొస్తే…ఒక కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు సగటున నాలుగు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి వివరించారు . రాష్ట్రంలో మెజారిటీ గృహాల్లో నెట్-మీటరింగ్ విధానం అమలులో ఉందని, కొన్ని చోట్ల స్మార్ట్ మీటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు .
