Nandyala | సాంఘీక సంక్షేమ వసతి గృహాలు.. పేద విద్యార్థుల భవితకు సోపానాలు : మంత్రి డోలా

నంద్యాల బ్యూరో, జులై 21 (ఆంధ్రప్రభ ) : పేద విద్యార్థుల భవితకు సాంఘీక సంక్షేమ వసతి గృహాలు (Social welfare hostels) సోపానాలుగా నిలుస్తున్నాయని, వసతి గృహంలోని బాలికలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ, వికలాంగ వయోవృద్ధులు, సచివాలయ, గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Dola Bala Veeranjaneya Swamy) పేర్కొన్నారు. నంద్యాల (Nandyala) జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి స్థానిక గిరినాథ్ సెంటర్ లో ఉన్న సాంఘీక సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహం 1,2 ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వసతి గృహంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఒక్కొక్క గదిలో ఎంతమంది బాలికలు ఉన్నారు, ఏయే తరగతి వారు వసతిగృహంలో ఉన్నారు, గదులన్నీ శుభ్రంగా ఉన్నాయా, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు బాలికలకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా అంటూ నిర్వాహకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమాన్ని అందిపుచ్చుకొని పేద విద్యార్థులు ముఖ్యంగా బాలికలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పేదల సంక్షేమం, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాలను అర్హులైన పేద వినియోగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదువుకుంటూ వసతి గృహాల్లో ఉంటే ఎలాంటి ఖర్చులు లేకుండా నాణ్యమైన విద్య, భోజనంతో కూడిన సౌకర్యాలు లభిస్తాయన్నారు. అనంతరం వసతి గృహంలోని బాలికలతో కలిసి మంత్రి, కలెక్టర్ భోజనం చేసి ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారులు, హాస్టల్ వార్డెన్స్, వసతి గృహ నిర్వాహకులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply