- డీఈవో భూపతిరావు
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో క్రీడలకు హబ్ గా కర్నూలు అవరిస్తోందని కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. శనివారం గార్గేయపురం సమీపంలోని కర్నూలు సిటీ ఫారెస్ట్ చెరువు వద్ద రాష్ట్రస్థాయి 4వ కెనోయింగ్, కయాకింగ్, డ్రాగన్ బోట్ పోటీలను ఘనంగా ప్రారంభించారు.
ఈ పోటీలను రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూలు సెంటర్ ఇన్‌చార్జ్ కార్తికేయన్, జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్, రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం కోశాధికారి డాక్టర్ రుద్రరెడ్డి, జిల్లా యోగ సంఘం ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఈఓ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ –కర్నూలు జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు నూతన క్రీడలను అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తేనే వారి భవిష్యత్తు దృఢంగా ఉంటుంది.
క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక సమతుల్యతతో పాటు సామాజిక విలువలు పెంపొందుతాయి అని పేర్కొన్నారు. డీఎస్సీఓ భూపతిరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పూర్తి సహకారం అందిస్తుంది. క్రమశిక్షణతో సాధన చేసే క్రీడాకారులు తప్పక ఫలితాలు సాధిస్తారన్నారు.
రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్ మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించడం క్రీడాస్ఫూర్తి. క్రమం తప్పకుండా సాధన చేస్తే క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలరు అని సూచించారు.
క్రీడల మైదానం మాత్రమే కాకుండా ఇప్పుడు నీటిమీద కూడా కర్నూలు జిల్లా కొత్త చరిత్ర రాస్తుందన్నారు.కెనోయింగ్, కయాకింగ్, డ్రాగన్ బోట్ వంటి జల క్రీడలు ఈ ప్రాంత విద్యార్థులకు కొత్త అవకాశాలను తీసుకొస్తాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా కర్నూలు నుంచి జల క్రీడాకారులు వెలుగొందే రోజు దూరంలో లేదని నిర్వాహకులు పేర్కొనడం విశేషం.
ఈ కార్యక్రమంలో కెనోయింగ్ -కయాకింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి మంచికంటి అవినాష్, జిల్లా వాటర్ స్పోర్ట్స్ కోచ్ చంద్రశేఖర్, జిల్లా స్కేటింగ్ సంఘం సునీల్ కుమార్, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య పాల్గొన్నారు.