చిన్న తప్పులే ప్రాణాలు తీస్తాయి…

వర్షాకాలం రాగానే ఆకాశం అంతా ఉరుములు, మెరుపులతో నిండిపోతుంది. ప్రకృతి అందంగా కనిపించినప్పటికీ, ఆ సమయంలో ప్రాణాంతకమైన ముప్పులు కూడా మనకోసం ఎదురుగా వస్తాయి.
వర్షాకాలంలో ఎదురయ్యే ప్రధాన ప్రమాదాలలో పిడుగులు ఒకటి. క్షణాల్లో ప్రాణాలను తీసే ఈ ప్రకృతి వైపరీత్యం.. తరచుగా గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు, కార్మికుల ప్రాణాలను బలిగొంటుంది. అయితే, కేవలం పల్లెల్లోనే కాకుండా నగరాల్లో ఉన్న మనమూ ఈ ప్రమాదానికి దూరం కాదనే నిజం గుర్తించాలి.
పిడుగు ఎక్కడ ఎప్పుడు ఎవరి నెత్తిమీద పడుతుందో చెప్పలేము, అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు వాతావరణ నిపుణులు.
ప్రకృతి నుంచి మనకు ఎదురయ్యే ముప్పులను పూర్తిగా ఆపడం మన చేతిలో లేకపోయినా, వాటిని ఎదుర్కోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం, సరైన సమాచారం, సముచితమైన రక్షణ చర్యలూ మన సమాజంలో పెద్ద సేఫ్టీ నెట్‌గా పని చేస్తాయి. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఈ నియమాలను పాటిస్తే, ప్రకృతి ముప్పులను ఎదుర్కోవడం చాలా సులభమవుతుంది.
ప్రతి ఏడాది అనేక మంది రైతులు, కూలీలు, పశువుల కాపర్లు పిడుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎప్పుడు పడతాయో తెలియని ఈ పిడుగులు మన జీవితాలను క్షణాల్లో మార్చేస్తాయి. కాబట్టి ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరి.
సాధారణంగా వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, కార్మికులు, బైక్ పై ప్రయాణించేవారు, పాదచారులు చెట్ల కింద ఆశ్రయం కోసం వెళ్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఆకాశంలో ఏర్పడిన విద్యుత్‌శక్తి భూమిపైకి దూసుకువచ్చేటప్పుడు ఎత్తైన ప్రదేశాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. పెద్ద చెట్లు, కొండలు, మైదానాలు, లోహ వస్తువులు పిడుగులకు లక్ష్యంగా మారతాయి.
అందువల్ల వర్షాకాలంలో, ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ఎత్తైన ప్రదేశాలను దూరంగా ఉండటం, ఎవైనా ఎత్తైన భవనాల్లోకి వెళ్లడం మంచిది. వర్షం పడుతున్నప్పుడు ద్విచక్రవాహనాలు నడపడం మానేయాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్ వాడకూడదు. ఈ చిన్న చిన్న మార్పులే ప్రాణాలను కాపాడగలవు.
ఇళ్లలో జాగ్రత్తలు..
ఇళ్లలో కూడా జాగ్రత్తలు అవసరమే. పిడుగు పడినప్పుడు ఒక్కసారిగా ఓల్టేజ్ వందల రెట్లు పెరిగిపోతుంది. దీంతో గృహోపకరణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో సరైన ఎర్తింగ్ ఉండాలి. తీగలు, ఫ్యూజులు నాణ్యమైనవే వాడాలి. ఉరుములు మొదలయ్యే సరికి ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి, ప్లగ్ పాయింట్ల నుంచి తీగలను తొలగించడం మంచిది.
సాధారణంగా పెద్ద భవనాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలలో లైట్‌నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేస్తారు. ఇవి పంచలోహాలతో తయారు చేసి భవనాన్ని రక్షించేలా పిడుగుల శక్తిని నేలలోకి మళ్లిస్తాయి. ఇళ్లలో కూడా ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తే మరింత సురక్షితంగా ఉంటుంది.
పిడుగుపాటు అనేది ఒక సహజ ప్రక్రియ. వాటిని ఆపడం మన చేతిలో లేదు. కానీ అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే, దాని ముప్పును నివారించవచ్చు.
