ఎస్‌ఎల్బీసీ పనుల్లో ఎన్నో అవాంతరాలు
నాలుగు రోజులైనా అంతుచిక్కని కార్మికుల జాడ
పనులు మొదలైన అయిదు రోజులకే ప్రమాదం
ఆకస్మాత్తుగా కూలిపోయిన సొరంగం పైకప్పు
టీబీఎంతో సహా మట్టిలో కూరుకుపోయిన యంత్రాలు
అక్కడ పనిచేసే వారిలో 42 మంది సురక్షితం
మరో ఎనిమిది మంది మాత్రం బయటికి రాలేకపోయారు
ఇంతకీ టీబీఎం అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోనూ ఇలాంటి ప్రమాదమే
2023 నవంబర్‌లో టన్నెల్ దుర్ఘటన
17 రోజుల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
41 మందిని సురక్షితంగా కాపాడిన ప్రత్యేక బృందాలు
నల్లమల టన్నెల్‌లో ఎందుకు ఆలస్యం అవుతోంది..
సామాన్యుల మదిలో సమాధానం లేని ప్రశ్నలెన్నో?
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం (టన్నెల్-1) 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు సొరంగం తవ్వాలి. ఇప్పటికి 34.37 కిలోమీటర్లు సొరంగం తవ్వారు. దీనికి రెండు వైపుల నుంచి అంటే ఇన్‌లెట్, అవుట్‌లెట్ వైపు నుంచి పనులు జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాలి. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాలి. ప్రస్తుతం నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వే రీతిలో పనులు ప్రారంభం అయ్యాయి. అంటే అంచనా ప్రకారం.. 23 నెలల్లో సొరంగం పని పూర్తవుతుంది. దీనికి నెలకు 14 కోట్ల రూపాయల చొప్పున ₹322 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఇంతకీ టీబీఎం సంగతేంటీ..
ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీలో డబుల్ షీల్డ్ టీబీఎం వినియోగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ తో సొరంగం తవ్వితే శబ్దాలు తక్కువ వస్తాయి. పైన ఉన్న నల్లమల అడవిలో మరెక్కడా తవ్వకుండా, పైకి శబ్దాలు రాకుండా ఉండటానికి ఈ యంత్రాన్ని ఎంచుకున్నారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ లేకుండా మట్టిని తొలగించడానికి ఈ యంత్రమే మంచిది. ముఖ్యంగా పరిసరాలు దెబ్బతినకుండా, పనిచేయడం ఈ యంత్రాల ప్రత్యేకత. ఒక రకంగా ఇది భూమిలోపల చెక్కుకుంటూ, కలుగు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. కొన్ని దశాబ్దాల నుంచీ ఈ తరహా యంత్రాలు వాడుకలో ఉన్నాయి. ఇందులో మెషీన్ ముందు వైపు తిరిగే డ్రిల్లింగ్ చక్రం ఉంటుంది. దాన్నే కట్టర్ హెడ్ అంటారు. తర్వాత మేరింగ్ ఉంటుంది. అలాగే వచ్చిన వ్యర్థాలను బయటకు పంపించే వ్యవస్థ ఉంటుంది. మట్టి, రాయి ఎంత గట్టిగా ఉంది? నీరు ఊరే శాతం.. ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఈ యంత్రాల్లో రకాలు మారతాయి. కాంక్రీట్ లైనింగ్, మెయిన్ బీమ్, గ్రిప్పర్, సింగిల్ షీల్డ్, డబుల్ షీల్డ్, ఎర్త్ ప్రెషర్ బాలెన్స్, ఓపెన్ ఫేస్ సాఫ్ట్ గ్రౌండ్ ఇలా చాలా రకాల యంత్రాలు ఉంటాయి. నడుమ ఎలాంటి యాక్సెస్ లేని ప్రపంచంలోనే పెద్ద టన్నెళ్లలో ఎస్‌ఎల్బీసీ ఒకటి. ఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్ (జయప్రకాశ్ అసోసియేట్స్) అనే కంపెనీ మొదటి నుంచీ ఈ ప్రాజెక్టు చేపట్టింది. సొరంగం తవ్వే పనిని అమెరికాకు చెందిన రాబిన్స్ సంస్థకు 2006 మే 26వ తేదీన ప్రభుత్వం అప్పగించింది. మొత్తం రెండు టీబీఎంలు, కన్వేయర్ బెల్టు, బ్యాకప్ సిస్టం, స్పేర్ పరికరాలు ఇతరత్రా బాధ్యత అంతా ఈ సంస్థకే అప్పగించింది.
టీబీఎం ఖరీదు ఎంతో తెలుసా?
ప్రపంచంలో సొరంగాలు తవ్వే టీబీఎం ఖరీదు చాల ఎక్కువే. నిర్వహణ వ్యయమూ ఎక్కువే. సొరంగం వ్యాసార్థాన్ని బట్టి విలువ ఉంటుంది. ఐదు మీటర్ల వ్యాసార్థం సొరంగం తవ్వే టీబీఎం ధర ₹43.43 కోట్లు కాగా.. ప్రస్తుతం 9 మీటర్ల వ్యాసార్థం టీబీఎం ధర ₹69.50 కోట్లు.. ఇలా వ్యాసార్థం పెరిగే కొద్దీ ₹ 260 కోట్లు నుంచి ₹850 కోట్లు వరకూ దీని ధర ఉంటుంది.
టీబీఎం ట్రబుల్ కు కారణమేంటీ?
2009 కృష్ణానదికి సంభవించిన వరదల్లో టీబీఎం మునిగిపోయింది. దీన్ని మరమ్మతులు చేయటానికి నాలుగేళ్లు పట్టింది. ఆ తర్వాత 2010లో సొరంగం పనులు ప్రారంభం కాగా.. అకస్మాత్తుగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను నిలిపి వేసింది. పదిన్నర ఏళ్లుగా టన్నల్ బోరింగ్ మిషన్ పనులు సాగలేదు. యంత్రాలు పని చేయకపోతే మొరాయించటం సహజం. యంత్ర భాగాలన్నీ తుప్పు పడతాయి. తాజాగా ప్రభుత్వం సొరంగం పనులు ప్రారంభించటంతో.. టీబీఎం పని పరిస్థితిని అంచనా వేసేందుకు జనవరి 31న ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5వ తేదీ నుంచి దపదపాలుగా టెస్ట్ చేశారు. ఫిబ్రవరి 15 నుంచి టీబీఎంను పూర్తి స్థాయిలో పని చేయించడం ప్రారంభించారు.
పని ప్రారంభమైన అయిదు రోజులకే..
ఫిబ్రవరి 20వ తేదీన టీబీఎం సెగ్మెంట్లను అమర్చుకున్నప్పుడు సిమెంట్ లీకేజీలను కార్మికులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. టీబీఎంలో సొరంగాన్ని తొలిచే వ్యవస్థ డ్రై గ్రౌంట్ సిస్టమ్, ఇన్వర్ట్ గ్రౌండ్ పంప్, సెకండరీ గ్రౌండ్ పంప్, లేసర్ గైడెన్స్ సిస్టం, ఫైర్ సస్పెషన్ సిస్టం, కమ్యూనికేషన్ వ్యవస్థ, డాటా అక్విషన్ వ్యవస్థ, సేఫ్టీ కంటైనర్, ప్రికాస్ట్ సెగ్మెంట్ ప్లాంట్, సెగ్మెంట్ స్టోరేజీ యార్డ్ ఇలాంటి భాగాలుంటాయి. ప్రమాదం జరిగిన రోజు ఉదయం షిఫ్టులోనే వచ్చిన కార్మికుల్లో ఇద్దరు టీబీఎంకు ముందు భాగంలో, మరో ఇద్దరు కింద అంతస్తులో, కన్వేయర్ బెల్ట్ వద్ద కొందరు పని చేస్తున్నారని తెలుస్తోంది. కానీ సొరంగాన్ని తొలిచే యంత్రం తనంతట తాను అమర్చుకునే సెగ్మెంట్లు ఒకేసారి కప్పు కూలిపోవడం, అందులోంచి భారీ ఎత్తున నీరు, బురద టీబీఎంలోకి చేరడంతో యంత్రం వెనకభాగంలోని కంటైనర్లు, పరికరాలు కొట్టుకుపోవటంతోనే తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది.