SLBC | ట‌న్నెల్లో స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్న సింగ‌రేణి ఎండి, ఛైర్మ‌న్ బ‌ల‌రామ్

హైద‌రాబాద్ – రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్.ఎల్.బి.సి. వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. సాహసోపేతంగా సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ చర్యలను సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ స్వయంగా పరిశీలించారు. సంస్థ ఛైర్మన్ తమతో పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఎన్. డి ఆర్.ఎఫ్ కల్నల్ తో కలిసి సింగరేణి ఛైర్మన్ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ప్రమాద స్థలి చేరువ వరకు పరిస్థితిని సహాయక చర్యలను పరిశీలించారు. సింగరేణి రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో జరుగుతున్న గ్యాస్ కటింగ్ పనులను ఆయన దగ్గరగా ఉండి పర్యవేక్షించారు. ట్రాకు పునరుద్ధరణ జరగాలంటే దానిపై కూలిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ.బి.ఎం) భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ పనిలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది తమ వద్ద గల అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాల ద్వారా ఇనుప పైపులను, గడ్డర్లను కత్తిరిస్తూ వేరు పరుస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కోసం ఈ ట్రాక్ పునరుద్ధరణ అత్యవసరం కనుక దీనిపై సింగరేణి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో ట్రాక్ మీద పేరుకుని ఉన్న బురద మట్టిని కూడా రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి.

మొత్తం 250 మంది సింగరేణి రెస్క్యూ సభ్యులు 24 గంటలు ఈ పనిలో పాల్గొనేందుకు వీరిని నాలుగు షిఫ్టులకు తగిన విధంగా విభజించడం జరిగింది. రక్షణ సూత్రాలు పాటిస్తూ ఇచ్చిన పనిని సమర్థంగా పూర్తి చేయాలని సంస్థ చైర్మన్ రెస్క్యూ సిబ్బందికి సూచించారు. ఇదిలా ఉండగా ఎన్జీఆర్ఐ బృందాలు వారు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి భూమి తొలిచే యంత్రాల (గ్రౌండ్ పెనట్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్)ద్వారా ఐదు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాలలో తవ్వకాన్ని సమర్ధంగా నిర్వహించడం కోసం ఎన్డిఆర్ఎఫ్, సింగరేణి బృందాలకు పనులు పురమాయించారు. దీనిలో సింగరేణి రెస్క్యూ బృందాలు అలుపెరగకుండా సమర్థంగా ముందుకు సాగుతున్నాయి. శుక్రవారం నాడు ప్రారంభమైన ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రత్యక్ష పరిశీలన, పర్యవేక్షణలో సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ తోపాటు జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అలుపెరగకుండా, అంకితభావంతో రెస్క్యూ సేవలందిస్తున్న సిబ్బందిని ఛైర్మన్ అభినందించారు. ఇచ్చిన లక్ష్యాలు సాధించాలని ఆయన సూచించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *