SLBC |టన్నెల్ లో మరో మృత దేహం గుర్తింపు

అమ్రాబాద్ – ఎస్ ఎల్‌బీసీ టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపడుతోంది. బృందాలు శిథిలాలను గ్యాస్ కట్టర్ లతో కట్ చేస్తున్నాయి.

ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.

ఇదిలా ఉండగా.. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సొరంగం తవ్వకం కొనసాగింపుతోపాటు ప్రస్తుతం టన్నెల్‌ ప్రమాదస్థలి వద్ద చేపడుతున్న సహాయక చర్యల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. సోమవారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు.

టన్నెల్‌ లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వీటిని నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు.

ఈ సందర్భంగా ప్రమాదస్థలిలో నెల రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని రెవెన్యూ (విపత్తు నిర్వహణ విభాగం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఆర్మీ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా.. ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 700 మంది సిబ్బంది ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు తెలిపారు.

Leave a Reply