కలెక్టర్కు దివ్యాంగులు, వృద్ధుల మొర
జెడ్పీలో స్వాభిమాన్ దివ్యాంగుల గ్రీవెన్స్
ఇప్పటి వరకు 169 దరఖాస్తులు స్వీకరించాం
కొందరికి పింఛన్లు కూడా మంజూరయ్యాయి
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, అక్టోబరు 17(ఆంధ్రప్రభ): సారూ.. దయచూపి పింఛన్ మంజూరు చేయరూ.. అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు దివ్యాంగులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ (Collector Swapnil Dinkar Pundkar) కు మొర పెట్టుకున్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ లో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొని అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మట్లాడుతూ… ప్రతీ మూడవ శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ (Special Grievance) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంత వరకు నిర్వహించిన 11 శుక్రవారాల గ్రీవెన్స్ లో 169 అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ఇందులో కొందరికి పింఛన్ కూడా మంజూరైనట్లు తెలిపారు. ఇంత వరకు వచ్చిన అర్జీలలో పెన్షన్లు, మెడికల్, చిన్న చిన్న భూ సమస్యలు, బ్యాటరీ ట్రై సైకిల్స్, ట్రై సైకిల్స్, వినికి యంత్రాలు, తదితర వాటిపై వచ్చినట్లు తెలిపారు. మెడికల్ సమస్యలకు సంబంధించి జీజీహెచ్, డీసీహెచ్ వారితో అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించే స్వాభిమాన్ కు 11 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సత్య నారాయణ పాల్గొన్నారు.


