Shivaji | మహిళా కమిషన్ జోక్యం..

Shivaji | మహిళా కమిషన్ జోక్యం..
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధండోరా’ సినిమా ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని భావించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, దీనిని సుమోటో (Suo Motu) కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ అనంతరం, ఆయన ప్రసంగంలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని కమిషన్ నిర్ధారించింది.
27న విచారణకు రావాలని శివాజీ నోటీసులు..
మహిళా కమిషన్ తన అధికారాలను ఉపయోగించి, తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1998లోని సెక్షన్ 16(1)(b) ప్రకారం ఈ విచారణను ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే నటుడు శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి. మహిళా కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం డిసెంబర్ 27వ తేదీన ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయంలో శివాజీ స్వయంగా కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఈ అంశం మీద ఇప్పటికే శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.
