Collector| శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి

Collector|శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి

  • అర్హులకు ప్లాట్ల కేటాయింపు, పంపిణీకి సిద్ధం కావాలి
  • అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు

Collector| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : శెట్టిపల్లి లేఔట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు, పంపిణీ ప్రక్రియను వేగంగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ డా. ఎస్‌. వెంకటేశ్వర్ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇంచార్జి జాయింట్ కలెక్టర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, తుడా అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ విభాగాలతో కలిసి లేఔట్ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. శెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఔట్‌ను నిర్మిస్తున్నామని, రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీటి పైపులు, విద్యుత్ కనెక్షన్లు, పార్కులు వంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

లేఔట్ పనుల్లో పాల్గొనే అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయం పెంచి, అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేకంగా జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. లేఔట్ సిద్ధమైన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి సంబంధిత శాఖలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాంమోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవికుమారి, భూ సేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ, రవీంద్రనాథ్, ఎస్‌ఈ కృష్ణా రెడ్డి, అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply