Sheena Nayak | ఈవో ఆగ్రహం..

Sheena Nayak | ఈవో ఆగ్రహం..
- పరిసర ప్రాంతాలను పట్టించుకోండి..
- పెద్ద రాజు గోపురం లోపల అస్తవ్యస్తంగా వస్తువులు..
- సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించకపోవడం పై అసహనం..
Sheena Nayak | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులు(Devotees) .. కోట్ల రూపాయల ఆదాయం, వ్యయం, వందల సంఖ్యలో ఉద్యోగులు సిబ్బంది.. అయినప్పటికీ అమ్మవారి ఆలయంలో కనీస పరిశుభ్రత, ఆధ్యాత్మిక పరిమళం కనిపించకపోవడం పట్ల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ అసహనం వ్యక్తం చేశారు. సంకటహర చతుర్థి సందర్భంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై ఉన్న పాత యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజలు దుర్గ గుడి చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం యాగశాల పరిసర ప్రాంతాలు, శివాలయానికి వెళ్లే దారిలో చెత్తాచెదారం, పనికిరాని వస్తువులు పరిసర ప్రాంతాలలో కనిపించడం పట్ల శీనా నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మవారి ప్రధానాలయం నుండి శివాలయానికి వెళ్లే దారిలో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన పారిశుధ్యం పట్ల అధికారులు, సానిటరీ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాజు గోపురం లోపల ఈవో సందర్శన సమయంలో ఒక పక్షి కళేబరం ఉండడం ఆ ప్రాంతమంతా అపరిశుధ్యంతో నిండి ఉండడంతో ప్రధానాలయ సూపర్డెంట్ (Superintendent) ను పిలిపించి మందలించారు. ఆ ప్రాంతంలో ఉన్న వస్తువులను సంబంధిత సామాగ్రిని తక్షణమే తీసివేసి శుభ్రంగా ఉంచాలంటూ హెచ్చరించారు. కమీషనర్ రామచంద్ర మోహన్ స్వయంగా పరిశీలించి శుభ్రం చేయించమన్నా చేయకపోవడం పట్ల ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయంలో పరిశుభ్రతను తప్పనిసరిగా ఉంచుతూ ఆధ్యాత్మిక శోభ, వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగి పైన ఉందంటూ ఈవో సంబంధిత ఉద్యోగులకు క్లాసు పీకారు.
కనిపించని డ్రెస్ కోడ్..
దుర్గగుడి చైర్మన్, ఈవో స్వయంగా ఇంద్రకీలాద్రి పై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది ఉద్యోగులు ఆలయ డ్రెస్ కోడ్ పాటించకపోవడం పట్ల ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత యాగశాల వద్ద పూజలు నిర్వహించి బయటకు వస్తున్న సందర్భంలో అక్కడే ఉన్న ఒక ఉద్యోగి డ్రెస్ కోడ్ (Dress Code) లో లేకపోవడం, శివాలయం దారి మహారాజు గోపురం ప్రధానాలయ ప్రాంతాలలో పర్యటిస్తున్న సందర్భంలో కొందరు ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించకపోవడం పట్ల వారిని పిలిపించి సున్నితంగా మందలించారు.

కొబ్బరికాయ ప్రాంతం కోసం కమిటీ…
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు (Devotees) సమర్పించే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని నిర్ణయించేందుకు ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేసేందుకు ఈవో శీనా నాయక్ నిర్ణయించారు. గతంలో శివాలయానికి వెళ్లే దారిలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంతో శబ్దాలు, అపరిశుద్ధ్యం కారణంగా ఆధ్యాత్మిక శోభ ఉండడం లేదని, ఇటు కాంట్రాక్టర్ కు అటు భక్తులకు ఉపయోగకరంగా ఉండే ప్రదేశాన్ని నిర్ణయించేందుకు ఏ సి,ఏ ఈ ఓ, ఇంజనీరింగ్ సెక్షన్, పాలకమండలి సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ కమిటీ సభ్యులు పూర్తిస్థాయిలో అన్ని ప్రాంతాలను పరిశీలించి కాంట్రాక్టర్కు ఇబ్బంది లేకుండా భక్తులకు అందుబాటులో ఉండే కొత్త ప్రదేశాన్ని నిర్ణయించనున్నారు.
