వేసవి క్రీడా శిబిరాలకు శాప్ సిద్ధం..

వేసవి క్రీడా శిబిరాలకు శాప్ సిద్ధం..
రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు
మే 1 నుంచి 31 వరకు శిబిరాలు
మున్సిపాలిటీలు, యూడీఏలు, విద్యాసంస్థల సమన్వయం
కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల సేవలు వినియోగం
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వేసవి సెలవులను క్రీడా అభివృద్ధికి వినియోగించాలనే లక్ష్యంతో శాప్ ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. మే 1 నుంచి 31 వరకు జరిగే ఈ శిబిరాలకు సంబంధించి అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో శాప్ కార్యాలయంలో చైర్మన్ అనిమిని రవి నాయుడు, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి (ఐఎఫ్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ ఏడాది శిబిరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, క్రీడా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలను భాగస్వామ్యంగా తీసుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమగ్రంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. శిక్షణా శిబిరాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ శాప్ కోచ్‌లతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, అనుభవజ్ఞులైన రిటైర్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని చైర్మన్ అనిమిని రవి నాయుడు సూచించారు. యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ శిబిరాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
శిబిరాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ఖరారు చేసి జిల్లాక్రీడా ప్రాధికార సంస్థలకు పంపిస్తామని వైస్ చైర్మన్ ఎస్ భరణి తెలిపారు. సమన్వయంతో కూడిన ప్రణాళిక ద్వారా ఈ ఏడాది శిబిరాలను మరింత ఫలప్రదంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
