మహిళా సాధికారతలో జిల్లా ఆదర్శం

మహిళా సాధికారతలో జిల్లా ఆదర్శం
రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో శ్రీకాకుళం
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా లోకానికి కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గత 25 ఏళ్లుగా సుమారు 5.36 లక్షల మంది మహిళలు సంఘటితమై ఆర్థిక, సామాజిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించారని ఆయన కొనియాడారు. వెలుగు ద్వారా ఇప్పటివరకు 10,458 మంది మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని, రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 10 వేల మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలు నిర్వహిస్తున్న 2,260 మంది మహిళా సంఘ సభ్యులకు రూ. 8.49 కోట్ల సీడ్ క్యాపిటల్ నిధులు అందించి, ఈ పథకం అమలులో శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినట్లు కలెక్టర్ గర్వంగా ప్రకటించారు. జిల్లాలో డ్రోన్ దీదీ, షేడ్ నెట్ సాగు, సముద్రపు పాచి పెంపకం వంటి వినూత్న జీవనోపాధి కార్యక్రమాలతో పాటు పొందూరు ఖాదీ, హిరమండలం కొండచీపుర్లు వంటి స్థానిక క్లస్టర్ల అభివృద్ధి ద్వారా మహిళలకు సుస్థిరమైన ఆదాయం కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.
