చిత్తూరు, (ఆంధ్రప్రభ బ్యూరో): పలమనేరు నియోజకవర్గం వి.కోట పంచాయతీలో భారీగా పంచాయతీ నిధులు మాయమయ్యాయి. ప్రజలు చెల్లించిన పన్నులను పంచాయితీ కార్యదర్శి, బిల్ కలెక్టర్, మరో కాంట్రాక్టు కార్మికుడు సొంతానికి వాడుకున్నారు.
ఈ విషయమై జరిగిన ప్రాధమిక విచారణలో నిధులు స్వాహా నిజమని తేలడంతో ముగ్గరిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయితీ అధికారి సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీ కార్యదర్శి యాదవపతి బిల్ కలెక్టర్ పృథ్వి మరొక కాంట్రాక్ట్ కార్మికుడి కలిసి సుమారు 50 నిధులను స్వాహా చేశారని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ కు ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై ప్రాథమిక విచారణ జరిపించారు.
ఈ విచారణలో నిధుల స్వాహా నిజమని తేలింది. పంచాయతీ కార్యదర్శి యాదవపతి 16 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. అలాగే బిల్ కలెక్టర్ పృద్వి 33 లక్షల రూపాయలను సొంతానికి వాడుకున్నట్లు విచారణలో తేలింది. విచారణ తర్వాత పది లక్షల రూపాయలను పంచాయతీకి జమ చేసినట్లు సమాచారం.
ఇందులో మరో కాంట్రాక్టు ఉద్యోగి కూడా ఉన్నట్లు తేలింది. ప్రాథమిక విచారణ అనంతరం పంచాయతీ కార్యదర్శి యాదవపతి, బిల్ కలెక్టర్ పృథ్వీలతోపాటు కాంటాక్ట్ కార్మికుడిని కూడా సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై శాఖా పరమైన విచారణకు ఆదేశించారు.