రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం..

రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం..
ఎమ్మెల్యే చొరవతో రూ.5 లక్షల సాయం..
సీఎంఆర్‌ఎఫ్ నుంచి నిధులు మంజూరు…
చేయి కోల్పోయిన మహిళకు అత్యవసర ఆర్థిక సహాయం…
ఆపరేషన్ ఖర్చుల కోసం తక్షణ స్పందనపై ప్రశంసలు..
తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక చేయి కోల్పోయిన మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఆంజనేయపురం గ్రామానికి చెందిన బొల్లెపోగు నాగమణి ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుటుంబానికి ఆధారమైన స్థితిలో ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చికిత్స, ఆపరేషన్ ఖర్చులు భరించలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆశ్రయించారు.
బాధితురాలి పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.5 లక్షల సాయం మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు ఎమ్మెల్యే సేవాభావాన్ని కొనియాడుతూ, కష్టకాలంలో ఆదుకోవడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించారని అభినందించారు.

