అభివృద్ధికి రూ.105 కోట్ల మంజూరు..
గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం పారిశ్రామిక నగరాన్ని నవనిర్మాణం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నానని, నగరం మరింత అభివృద్ధి చేపట్టేందుకు 105 కోట్ల రూపాయలు మంజూరైనట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు.
ఈ రోజు గోదావరిఖనిలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటివరకు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, అదేవిధంగా డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ , అర్బన్ డెవలప్మెంట్ నుండి విడుదలైన నిధులతో నగరంలో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని చెప్పారు.
నియోజకవర్గం లోని బసంత్ నగర్ ఏరియా బుగ్గ రామస్వామి దేవాలయ ప్రాంతం నుండి గోలివాడ వరకు, అలాగే బ్రాహ్మణ పల్లి, ధర్మారం క్రాస్ రోడ్ నుండి వేమునూరు వరకు, రామగుండం పట్టణం దాకా ప్రధాన బి టి రహదారులు, అంతర్గత రోడ్ల నిర్మాణం పనులకు ఆర్ అండ్ బి నుండి మరో రూ. 50 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వివరించారు.
రూ. 10 కోట్లతో సర్వీస్ రోడ్లు, ఐలాండ్స్ నిర్మాణం పనులు చేపట్టనున్నామని, పెద్దంపేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కు క్లియరెన్స్ వచ్చిందన్నారు. రూ. 20 కోట్ల రూపాయలతో రామగుండం పట్టణ అభివృద్ధి, రూ.18 కోట్ల తో మజీద్ టర్నింగ్ నుండి లింగాపూర్ వరకు రోడ్డు నిర్మాణం, రూ.7.50 కోట్లతో గోదావరిఖనిలోని జూనియర్ కాలేజీ పునర్నిర్మానం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సింగరేణి సంస్థ నుండి మొదటి విడుదల రూ.15 కోట్లతో గోదావరిఖని పట్టణంలో 224 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నామని, రెండో విడతగా మరో 15 కోట్లతో 156 షాపుల నిర్మాణం , నాలుగు కోట్ల రూపాయలతో గోదావరిఖనిలోని గోదావరి నది పక్కన ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మక్కన్ సింగ్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్, కాల్వ లింగస్వామి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేస్తా…
రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కోసం కోట్ల రూపాయలను గత ప్రభుత్వంలోని నేతలకు అప్పగించి మోసపోయిన బాధితులు తనను కలిస్తే… న్యాయం చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు.
ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేయడానికి తాను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి నేతల అవినీతి మోసాలను… కుట్రలపై స్వయంగా కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేస్తుందని గుర్తు చేశారు.


