ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (84) సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.వయస్సు మీదపడటంతో కొంతకాలంగా పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత మూడురోజుల క్రితం ఒంగోలు కిమ్స్ కు చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు.కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్ధం సోమవారం పిచ్చమ్మ పార్దీవ దేహాన్ని వైవీ సుబ్బారెడ్డి నివాసం వద్ద ఉంచనున్నట్లు తెలిపారు.
సాయంత్రం సమయంలో వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లకు పిచ్చమ్మ పార్ధీవదేహాన్ని తరలించి మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. అయితే, పిచ్చమ్మ పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిలతోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉంది.