Farmer | వ్యవసాయానికి పునరుజ్జీవనం
రైతు జీవితాన్ని మార్చే ప్రభుత్వ ఉద్యమం
Farmer | చిత్తూరు బ్యూరో ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించే ప్రక్రియ మాత్రమే కాదు, అది గ్రామీణ జీవనానికి ప్రాణం పోసే మూలాధారం. పంటను పండించే రైతు శ్రమకు సముచిత గౌరవం ఇవ్వాలని, వ్యవసాయ రంగాన్ని(Agriculture sector) కొత్త దిశలో ముందుకు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో సాగుతున్న పథకాలు ఇప్పుడు వేలాది మంది రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్రంలో రైతులకు ధైర్యం నింపిన కీలక కార్యక్రమంగా నిలుస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేల రూపాయలు, మొత్తం ఏడు వేల రూపాయలు ప్రతి విడతలో నేరుగా ఖాతాల్లో జమ అవుతుండడం రైతుకు ఆర్థికంగా గట్టి బలం అందిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకూ రెండు విడతల్లో 2,05,753 మంది రైతులకు మొత్తం 273 కోట్ల రూపాయలు జమ కావడం ఈ పథకం కారగ్యక్షమతకు నిదర్శనం.

రసాయన ఎరువుల అధిక వినియోగం కారణంగా భూసారం (soil) తగ్గిపోవడం, నీటి నాణ్యత క్షీణించడం, పంటల ఉత్పత్తి అస్థిరంగా మారడం రైతులను పెద్ద సంక్షోభాలకు గురిచేస్తున్నాయి. ఖర్చులు పెరిగి, లాభాలు తగ్గిపోవడంతో రైతు జీవితం అశాంతిగా మారింది. ఈ మారుతున్న పరిస్థితుల్లో ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారింది. రసాయన రహిత విధానంలో సాగుచేసే సహజ వ్యవసాయం రైతుకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం అందించడమే కాకుండా భూమి సారాన్ని కాపాడుతుంది. జీవామృతం వంటి సహజ ఉత్పేరకాలు, దేశీయ విత్తనాలు, దుక్కిలేని సాగు, సహజ వనరుల వినియోగం వంటి పద్ధతులు రైతు ఆధారపడే ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ విధానంతో పండించే ఆహార పదార్థాలు ఆరోగ్యపరంగా బలమైనవి కావడంతో వినియోగదారుల వర్గం కూడా సహజ పద్దతుల్లో పండిన దిగుబడుల వైపు ఆకర్షితమవుతోంది. రైతు, వినియోగదారుడు, పర్యావరణం ఈ మూడింటికీ సమాన ప్రయోజనం చేకూర్చే ఈ వ్యవసాయ రూపంలో ప్రభుత్వం పెట్టిన దృష్టి గ్రామీణ వ్యవసాయంలో భిన్నమైన మార్పుకు నాంది పలుకుతోంది.
గుడిపాల మండలం కిలారి వారి పల్లి గ్రామానికి చెందిన టి. విజయ నాయుడు ఈ మార్పును తన జీవితం ద్వారా నిరూపించిన రైతు. ఆయనకు 5 ఎకరాల 4 సెంట్ల భూమి ఉండగా, బిందు సేద్యానికి దరఖాస్తు చేసిన కేవలం పది రోజులకే రాయితీతో కూడిన మైక్రో ఇరిగేషన్ యూనిట్లు ప్రభుత్వంనుంచి అందుకోవడం ఆయనకు ఊహించని సంతోషాన్ని కలిగించింది. ఈ ఆధునిక సేద్యం విధానం వల్ల ప్రతి మొక్కకు అచ్చంగా అవసరమైనన్ని నీళ్లు మాత్రమే అందుతాయి. నీటి ఆదా, సమయానికి నీరు అందడం వల్ల దిగుబడి పెరగడం ఇవి కలిసి అతని వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చాయి. మరోవైపు అన్నదాత సుఖీభవ (The happiness of the breadwinner) పీఎం కిసాన్ పథకం కింద ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లోనే పద్నాలుగు వేల రూపాయలు నేరుగా ఖాతాలో జమ కావడం వల్ల పంట మొదలుపెట్టే సమయంలో అవసరమయ్యే ఖర్చుని తేలికగా నిర్వహించగలిగానని ఆయన చెబుతున్నారు.
ప్రకృతి సహజ పద్దతులతో సాగుచేసే తన భూమిలో వరి, వేరుశెనగ (Peanut) కంది, అలసంద వంటి అంతర పంటలను పండిస్తున్నారు. ఆయనకు పాడి పశువులు ఉండగా, వాటికి పూర్తిగా రసాయన రహిత పద్ధతిలో పండించిన పశుగ్రాసాన్ని మేతగా అందిస్తున్నారు. సహజంగా పండిన మేత వల్ల పశువులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాల ఉత్పత్తి కూడా పెరిగిందని ఆయన ఆనందంగా చెబుతున్నారు. పంటపై రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసిన తర్వాత తన వ్యవసాయ భూమి మళ్లీ సారవంతం అవుతున్నదని, పంటలు వేగంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తున్నాయని ఆయన అనుభవంతో చెబుతున్నారు. ఆయనకున్న ఇద్దరు పిల్లల చదువుకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తోడ్పడుతోందని ఆయన కుటుంబం సంతృప్తిగా జీవిస్తున్నదని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఎందరో రైతులు భయంతో చూడగా, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఆర్థిక సహాయం, మైక్రో ఇరిగేషన్ వంటి ఆధునిక సదుపాయాలు రైతు ధైర్యాన్ని పెంచుతున్నాయని విజయ నాయుడు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహజ వ్యవసాయ ఉద్యమం ఇప్పుడు రైతులలో కొత్త నమ్మకాన్ని (A new belief) నాటుతోంది. భూమి దెబ్బతినకుండా పంటలు పండించడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు సమాజానికి అందించడం, రైతుకు ఖర్చులు తగ్గి లాభాలు పెరగడం ఈ మూడు లక్ష్యాలు ఒకే మార్గంలో చేరుతున్నాయి. చిత్తూరు జిల్లాలో సహజ వ్యవసాయాన్ని అవలంబించే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహం, రైతుల అనుభవాలు కలిసి ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తున్నాయి. రైతు కుటుంబం అభివృద్ధి చెందితేనే గ్రామీణ ప్రాంతాలు నిజమైన పురోగతిని సాధిస్తాయి. ఈ దిశలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వము బలంగా ముందుకు తీసుకెళ్తుండటం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భవిష్యత్తుకు శుభ సూచికంగా నిలుస్తోంది.

