Revanth Reddy | శాంతి, ప్రేమ మార్గంలో ప్ర‌జాపాలన..

ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుప్రభువు బోధించిన శాంతి, ప్రేమ సందేశాలే స్ఫూర్తిగా తమ ప్రజా ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తోందని పేర్కొన్నారు.

సమాజంలో మత విద్వేషాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే, ఇతర మతాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మత ప్రాతిపదికన దాడులకు పాల్పడితే ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు. ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడే వారిని కఠినంగా శిక్షించేలా శాసనసభ సమావేశాల్లో కొత్త చట్టాన్ని తీసుకువస్తామని ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు.

డిసెంబర్ నెల తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌కు ఒక ‘మిరకిల్ మంత్’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ నెలలోనే తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరుస్తూ ప్రకటన వెలువడిందని, అలాగే ప్రజా ప్రభుత్వం కూడా ఇదే నెలలో కొలువుదీరిందని గుర్తుచేశారు.

ఎన్ని అడ్డంకులు, దుష్ప్రచారాలు ఎదురైనా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ… సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వంతో పోటీ పడి నిరుపేదలకు అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.

మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం ఎవరి దయా కాదని, అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తామని, ఊరికి దూరంగానైనా వీటికి స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, నూతన సంవత్సరంలో ఈ మార్పు కోసం అందరూ ఆశీర్వదించాలని కోరారు.

ఈ వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్ వంటి ప్రముఖులు, మత పెద్దలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Leave a Reply