Return Voyage | అమెరికా నుంచి తిరిగి వచ్చిన కెటిఆర్ …

హైదరాబాద్‌: అమెరికా పర్యటన ముగించుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గ‌త అర్ధ‌రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. లండన్‌, అమెరికా పర్యటనలో భాగంగా మే 27న హైదరాబాద్‌ నుంచి కేటీఆర్‌ బయల్దేరారు. అదేరోజు సాయంత్రం లండన్‌ చేరుకున్న ఆయన బీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ కార్యవర్గ సభ్యులు, సీనియర్‌ నేతలతో లండన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం యూకే తెలుగు బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

మే 30న బ్రిడ్జ్‌ ఇండియా వీక్‌-25 సదస్సులో కేటీఆర్‌ చేసిన కీలకోపన్యాసం దేశవిదేశాల ప్రతినిధులను ఆకట్టుకున్నది. సుస్థిరమైన ఆర్థికాభివృద్ధితో ప్రపంచానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిన తీరును తనదైన శైలిలో వివరించారు. సంపద సృష్టించి పేదలకు పంచేవిషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాలను క్లుప్తంగా తెలియజెప్పారు. అనంతరం వార్విక్‌ యూనివర్సిటీలో మెక్‌లారెన్‌, ఆస్టన్‌ మార్టిన్‌, జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ లాంటి దిగ్గజ సంస్థలకు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సేవలు అందించే పీడీఎస్‌ఎల్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. లండన్‌లో కార్యక్రమాలను ముగించుకున్న కేటీఆర్‌ అక్కడి నుంచి అమెరికాలోని డాలస్‌కు బయల్దేరారు.

జూన్‌ 1న డాలస్‌ చేరుకున్న కేటీఆర్‌.. ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు. జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ (యూటీ డాలస్)లోని భారతీయ విద్యార్థులను కలిశారు. అమెరికాలో సమస్యలు ఎదుర్యొంటున్న భారతీయ విద్యార్థులకు న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకున్న కేటీఆర్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు.

డాలస్‌ పర్యటన మధుర జ్ఞాపకాలు మిగిల్చింది..
డాలస్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలు విజయవంతం కావడానికి కృషి చేసిన అక్కడి కొంత మంది వ్యక్తుల మధురమైన జ్ఞాపకాలను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం స్మరించుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. వారి పేర్లను పోస్ట్‌లో పేర్కొన్నారు. డాలస్‌లో సహకరించిన శ్రావణి, ఉదయ్‌కుమార్‌రెడ్డి దంపతుల గురించి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి పిల్లలకు కేసీఆర్‌ అని పేరు కూడా పెట్టారని తెలిపారు. కట్టా ఐద్వెత్‌ చంద్రారెడ్డి(కేసీఆర్‌), కట్టా అద్విక్‌ చంద్రారెడ్డి(కేసీఆర్‌) అని వారి పిల్లలకు పేర్లు పెట్టారని, చాలా సంతోషమని కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై తన ప్రేమను చూపించడానికి 2000 మైళ్ల్లు కారు నడుపుకుంటూ వచ్చిన కిశోర్‌ను కేటీఆర్‌ ఎక్స్‌ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్‌ఎస్‌ మరో అభిమాని ప్రవీణ్‌రెడ్డి కోలన్‌ తన గడ్డానికి గులాబీ రంగు వేసుకునేంత వరకు వెళ్లారని చెప్పారు. ఆయన ఉల్లాసం, ఉత్సాహానికి మంత్రముగ్ధుడయ్యానని తెలిపారు. వారి పేరును కూడా ఎక్స్‌లో పోస్టు చేశారు. గొప్ప మద్దతుదారుడు శశాంక్‌ వెలగాల కుటుంబ సభ్యులను కలిసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన వారికి ఎక్స్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు మద్దతు ఇచ్చి.. విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply