కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆరోపణ
ముధోల్, ఏప్రిల్ 17(ఆంధ్రప్రభ): ఆదిలాబాద్ జైల్లో ముధోల్ మండల కేంద్రానికి చెందిన సిందే సాయినాథ్(32) ఖైదీగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కావాలని బైఠాయించారు. సిందే సాయినాథ్ అనుమానాస్పద మృతికి జైలరే కారణమని ఆరోపించారు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం… గత ఫిబ్రవరి నెలలో ఒక కేసు విషయంలో సిందే సాయినాథ్ తో పాటు ముగ్గురు వ్యక్తులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. అప్పటి నుండి జైలుకు వెళ్లి చూడడానికి జైలర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. నాలుగు సార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా బెయిలు మంజూరు కాలేదు. చనిపోయిన తర్వాత చాకచక్యంగా బెయిల్ మంజూరు చేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు.
జైలులో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా హైదరాబాద్ గాంధీకి రెఫర్ చేశారు. సిందే సాయినాథ్ ఆరోగ్యం బాగాలేదని, రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జైలు నుండి సమాచారం రాగానే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లామని, అప్పుడు సిందే సాయినాథ్ ను కాళ్లకు గోలుసులతో కట్టేసి ఉంచారని తెలిపారు. పూర్తి స్పృహలో లేకుండా ధీనావస్థలో ఉన్నాడని తెలిపారు. జైలుకు వెళ్లే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, జైలుకు ఆరోగ్యంగా వెళ్లిన వ్యక్తి చనిపోవడం ఏమిటని ప్రశ్నించారు. జైలర్ పూర్తి నిర్లక్ష్యంతోనే జైలులో ఉన్న సిందే సాయినాథ్ చనిపోయాడని అన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
చట్టపరంగా జ్యుడీషియల్ దర్యాప్తు జరుగుతుంది… సి.ఐ మల్లేష్, ఎస్సై సంజీవ్
ఆదిలాబాద్ జైలులో రిమాండ్ లో ఉన్న ఖైదీ చనిపోవడం వల్ల చట్ట పరంగా జ్యుడీషియల్ దర్యాప్తు జరుగుతుందని సి.ఐ మల్లేష్, ఎస్సై సంజీవ్ పేర్కొన్నారు.