KNL | ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం.. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

మంత్రాలయం, మే 18(ఆంధ్ర ప్రభ) : ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ‌ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి అరెస్టులపై ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి స్పందించి మంత్రాలయంలోని ఓ వసతి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… లిక్కర్ స్కాం జరిగిందంటూ విచారణ పేరుతో ఐఏఎస్ అధికారి ధనుంజయ‌ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. 2019లో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 43వేల బెల్టు షాపులు తీసివేయడం, 4380 పర్మిట్ రూంలు రద్దు చేయడం జరిగిందని వివరించారు.


టీడీపీ హయాంలో రూ.25వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని సీఐడీ అధికారులు నిర్దారణ చేయడం జరిగిందని, టీడీపీ హయాంలో 69శాతం మద్యం అమ్మకాలు జరిగితే వైస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గుతూ వచ్చాయన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు చేయలేక.. వైస్సార్సీపీ నేతలు, అప్పటి అధికారులు, సోషల్ మీడియా కార్యకర్తలు లక్ష్యంగా అక్రమ కేసులు పెట్టడమే కూటమి పనిగా పెట్టుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎంత మంచివాడో… అంతే మొండి వాడు… అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కేసులు, దాడులు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకి రెట్టింపు స్థాయిలో రివైంజ్ ఉంటుందని మండిపడ్డారు. గ్రామాల్లో ఇబ్బందులు పడిన నాయకులు, కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి చెప్పినా వినే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, జనార్దన్ రెడ్డి, తదితరులున్నారు.

Leave a Reply