బెంగళూరు వేదికగా ఈ సీజన్‌లో ఆర్‌సిబి తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆర్‌సిబి 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ విజయంతో తమ ఖాతాలో 12 పాయింట్లు వేసుకున్న ఆర్సీబీ.. 3వ స్థానానికి చేరుకుంది.
ఛేజింగ్‌లో బౌండరీలతో చెలరేగిన రాజస్థాన్ జట్టు ఆఖర్లో చేతులెత్తేసింది. విజయం దాదాపు ఖాయమనుకున్న సమయంలో, ఆర్సీబీ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్ బోల్తా కొట్టించారు. దాంతో మ్యాచ్ రాజస్థాన్ చేజారింది. రాజస్థాన్ విజయానికి రెండు ఓవర్లలో 17 పరుగులు కావాల్సి ఉండగా.. 19వ ఓవర్లో హాజిల్‌వుడ్, 20 ఓవర్లో యష్ దయాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దాంతో చివరి 2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్… 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.
కాగా, ఈ మ్యాచ్ లో బెంగళూరు నిర్ధేశించిన 206 పరుగుల ఛేదనలో.. రాజస్థాన్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (19 బంతుల్లోనే 49) సిక్సులు, ఫోర్లతో విజృంభించాడు. దృవ్ జురేల్ సైతం (34 బంతుల్లో 47) బౌండరీలతో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక నితిష్ రాణా (28), కెప్టెన్ రియాన్ పరాగ్ (22), శుబం దూబే (12) రాణించారు.
అయితే, ఆర్‌సిబి బౌలర్లు ఒత్తిడికి లోనవ్వకుండా తెలివిగా కోలుకుని వరుసగా వికెట్లు తీసి ఆర్‌ఆర్‌కు షాక్ ఇచ్చారు. దీంతో, రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లతో మెరిశారు. కృణాల్ పాండ్య రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
దూకుడైన ఆరంభం..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దంచికొట్టింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 26) రాణించగా… విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70 ), వన్‌డౌన్ లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (26 బంతుల్లో 50) అర్ధ శతకాలు బాదారు.
ఇక ఆఖర్లో టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేష్ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 205/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగ చెరో వికెట్ దక్కించుకున్నారు.