Ramagundam | చట్ట వ్యతిరేక చర్యలను ఉపేక్షించం.. రామగుండం సీపీ అంబర్‌ కిశోర్ ఝా

గోదావరిఖని, (ఆంధ్రప్రభ): శాంతిభద్రతల పరిరక్షణ కోసం 24 గంటలు పని చేస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ నూతన సీపీగా నియమితులైన అంబర్‌ కిషోర్‌ ఝా మొదటగా సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ రామగుండం పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

సత్ప్రవర్తన, మంచి నడవడిక కలిగిన వారికీ, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేయడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నూతన -టె-క్నాలజీని నేరాల నియంత్రణకు కృషి చేస్తామని, ల్యాండ్‌ మాఫియా, డ్రగ్స్‌, గంజాయి రవాణా పట్ల ఉక్కు పాదం మోపుతామన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరిస్తూ.. చట్ట పరిధిలో సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా అందుబాటు-లో ఉన్న డీసీపీలతోపాటు- తనను కూడా నెరుగా కలవొచ్చని వారికి అండగా పనిచేస్తామన్నారు.

కాగా, 2009 ఐపిఎస్‌ బ్యాచ్‌ కు చెందిన అంబర్‌ కిషోర్‌ ఝా 2011లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏఎస్పీగాను 2012 వరంగల్‌ ఓఎస్‌డీగా, అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు- 2014లో వరంగల్‌ ఎస్పీగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు- అనంతరం భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే 2018లో హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ డిసిపిగాను ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొంది రాచకొండ జాయింట్‌ సీపీగా పనిచేశారు. అనంతరం వరంగల్‌ సీపీగా పనిచేశారు.

ప్రస్తుతం రామగుండం పోలీస్‌ కమీషనర్‌గా నియమించబడ్డారు. అంతకుముందు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్‌, పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన ఇతర పోలీస్‌ అధికారులు నూతన పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ ఏసిపిలు, ఇన్సెస్నెక్టర్లు, ఏఆర్‌ ఏసీపీలు, ఆర్‌ఐలు ఇతర విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply