అతలాకుతలం..

వానలు దంచికొడుతున్నాయి. వరదలు అన్ని ప్రాంతాలనూ ముంచెత్తుతున్నాయి. పంటలు పండాలన్నా, త్రాగునీరు కావాలన్నా వానలు కురవాలి.. మంచిదే, కానీ, నీటి పారుదల వ్యవస్థ సరిగా లేని నగరాల్లో వర్షాలు కురిసి ఏం లాభం? చిన్న వర్షాలకే అతలాకుతలామవుతున్న నగరాల్లో జనాల అవస్థలు చెప్పనలవి కాకుండా ఉంటోంది.
ముఖ్యంగా రెక్కాడితేగానీ డొక్కాడని వేతన జీవులకు, దినసరి కూలీలకు వర్షం చాలా ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంది. ఉదయం స్కూళ్ళకు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు కురుస్తున్న వర్షాలవల్ల, అసలే ట్రాఫిక్ సమస్యతో అల్లాడిపోతున్న వారికి వర్షం వల్ల నిలిచిపోయిన రహదారుల్లో ఎలావెళ్ళాలో తెలియక, నిలిచి పోయిన వర్షం నీళ్ళ కింద ఏ తెరిచిన మ్యాన్ హోళ్ళు ఉన్నాయో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారు.
పెద్ద పెద్ద కార్లు సైతం రోడ్లమీద ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి, ఇక ద్విచక్ర వాహనాల సంగతైతే చెప్పనలవి కాకుండా ఉంటోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు నీటి పారుదల విషయంలో ఏవో ఒకటి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే ఉంటోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టే అనిపిస్తోంది. కానీ పరిస్థితులు మాత్రం మామూలే. అందుకే ప్రజలు వర్షాకాలం బయటకు రావాలంటే ఆలోచించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

