Puttaparthi MLA | వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలి

Puttaparthi MLA | వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలి
- పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
Puttaparthi MLA | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎల్లప్పుడూ ఉండాలని పుట్టపర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు పల్లె సింధూర రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా జీవించాలంటూ ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.
తిరుపతిలో రెండు రోజులుగా జరుగుతున్న మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన మహిళా ప్రజా ప్రతినిధుల కమిటీ సమావేశాలకు హాజరైన సందర్భంగా ఈ రోజు ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో సహచర మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలుకావాలని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు భగవంతుని కృప లభించాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు ప్రజల సహకారం కూడా అవసరమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
తిరుమల దర్శనం అనంతరం ఆలయ అధికారుల ఆశీర్వచనాలు స్వీకరించిన పల్లె సింధూర రెడ్డి, అనంతరం మహిళా ప్రజా ప్రతినిధుల కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో మహిళా సాధికారత, సామాజిక సంక్షేమం, పేదల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం.
