సింగరేణి ఓసీల్లో ఉత్పత్తులకు ఆటంకం
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి (Singareni) బొగ్గు పరిశ్రమ కోల్ ప్రొడక్షన్ పై వర్షం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ రోజు తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. రామగుండం రీజియన్, శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, బెల్లంపల్లి ఏరియా, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లోని 17 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు(ఉపరితల బొగ్గుగనుల్లో) ఉత్పత్తి వెలికితీత కష్టతరం అయిపోయింది.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల (Open cost projects) లో ఒక రోజుకు సుమారుగా 1.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి వెలికి తీయాల్సి ఉంటుంది. తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తుల వెలికితీత అసాధ్యమైపోయింది. అదేవిధంగా కోల్ బెల్ట్ ఏరియా వ్యాప్తంగా ఉన్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఒక రోజుకు సుమారుగా 14 లక్షల ఓబి (ఓవర్ బర్ధన్ మట్టి) తొలగింపులు తీయాల్సి ఉన్నప్పటికీ వర్షాల కారణంగా ఓబీ పనులు పూర్తిగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
రామగుండం రీజియన్ (Ramagundam Region) లోని 1,2,3,5 ఉపరితల బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. రామగుండం బిజిఎల్లో సుమారుగా 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. జులై నుండి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తుల టార్గెట్ తక్కువగా ఉన్నప్పటికీ తరచుగా వస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తులపై వర్షం ప్రభావం ఎక్కువగానే చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉపరితల గనుల్లోకి వరద నీరు అంతా చొచ్చుకు వచ్చింది.
వర్షంలో కూడా బొగ్గు రవాణా (Coal transportation) కొనసాగుతుంది. అప్పటికే ఉత్పత్తి చేసి నిల్వ ఉంచిన బొగ్గును ఈ రోజున విద్యుత్ థర్మల్ కేంద్రాల తోపాటు ఇతర పరిశ్రమలకు 1 లక్ష 30 వేల టన్నుల బొగ్గును రవాణా చేశారు. ఇది ఇలా ఉండగా వర్షాల కారణంగా బొగ్గు గనులు, ఓపెన్ ఫస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తుల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా స్వయంగా సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ ఏరియాల వారీగా జీఎంలతో అక్కడ పరిస్థితులను ఆరా తీస్తూ పర్యవేక్షిస్తున్నారు.