ఒక్కరోజులో రూ.349 లక్షల కోట్ల సంపద ఆవిరి
ట్రంప్ కొత్త అర్థిక విధానాలతో షేర్ మార్కెట్ లో ఒడిదుడుకులు
ఎలాన్ మస్క్ కంపెనీల షేర్లు సైతం డమాల్
అమెరికా స్టాక్ మార్కెట్లు నేడు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి. దీంతో ప్రధాన సూచీలైన నాస్‌డాక్, ఎస్ అండ్ పి 500 వరుసగా 4 శాతం, 2.70 శాతం పడిపోయాయి. దీంతో ఏకంగా గంట వ్యవధిలోనే ఏకంగా $4 ట్రిలియన్ల (రూ. 349 లక్షల కోట్లు)ను కోల్పోయింది. 2022 తర్వాత అమెరికాలోని టెక్నాలజీ స్టాక్‌లు అత్యంత పెద్ద ఇంట్రాడే నష్టాలను చవిచూడటం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అమ్మకాలు కేవలం ఈక్విటీలు మాత్రమే కాకుండా, కార్పొరేట్ బాండ్‌లు, డాలర్, క్రిప్టోకరెన్సీ సహా అనేక ఇతర అంశాలపై కూడా ప్రభావితం చూపించాయి.
కారణాలివేనా..
మరోవైపు అమెరికా బాండ్ ధరలు కూడా పడిపోయాయి. ట్రంప్ సుంకాల నిర్ణయాలు ఆర్థిక పరిణామాలపై ఆందోళనలు సృష్టిస్తున్నాయి. కెనడా, మెక్సికో, చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించాయి. అలాగే భారతదేశంపై కూడా సుంకాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ చర్యలు ప్రధానంగా వ్యాపారులు, పెట్టుబడిదారులకు అనిశ్చితిని పెంచాయి. ట్రంప్ సుంకాల విధానాలు, ఖర్చు కోతలు అమెరికా ఆర్థిక వ్యవస్థను నెమ్మదింపజేస్తాయని, మాంద్యం ప్రమాదాన్ని పెంచుతాయనే భయాలు నెలకొన్నాయి. దీంతో మదుపర్లు అమ్మకాల వైపు ఆసక్తి చూపారు. ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు ఆసక్తి చూపిస్తుండటంతో పెట్టుబడులు తగ్గి, అమ్మకాలు పెరిగాయి.. దీంతో నష్టాల బాటలో షేర్ మార్కెట్ నడుస్తున్నది.
ఎలాన్ మస్క్ కి భారీ దెబ్బ..
ఇక ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు సైతం 15 శాతం మేర కుదేలైంది. అమెరికా సమాఖ్య ప్రభుత్వ షట్ డౌన్, ట్రంప్ దూకుడు నిర్ణయాలు మార్కెట్ ను కుదిపేస్తున్నాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో, నేడు భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.