ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో (assembly sessions) బిగ్వార్ జరగబోతోంది. ఓవైపు కాళేశ్వరం రిపోర్ట్ (Kaleshwaram report).. మరోవైపు వర్షాలు.. యూరియా కొరత.. బీసీ కోటా గురించి అసెంబ్లీలో పెద్ద రచ్చ జరిగే చాన్స్ ఉంది. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ, బీఆర్ఎస్(BRS)ల మధ్య వీటిపై మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజులు ఈ అసెంబ్లీ వార్ ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో కాళేశ్వరంపై కమిషన్ నివేదిక గురించి చర్చించడమే ప్రధాన అజెండా. ఇది అత్యంత కీలకమైన అంశం కావడంతో దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య వాడీవేడీగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే(MLA)లు ఏ వ్యూహంతో ముందుకు పోతారు.. ఎవరు పైచేయి సాధిస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది.
తొలి రోజు ఇలా…
తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Jubilee Hills MLA Maganti Gopinath)పై, మండలిలో మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి (Magam Ranga Reddy)పై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు నివాళులర్పించారు. సంతాప తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు మర్నాటికి వాయిదా వేశారు.
కాళేశ్వరం రిపోర్ట్ పై ఫస్ట్ ఫైట్
అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై ఈసారి హైవోల్టేజ్ వార్ ఖాయమే. ఎందుకంటే అక్కడ చర్చించబోయేది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైనే. 2023 అక్టోబర్ లో మేడిగడ్డ (Medigadda) కుంగడంతో మొదలైన కాళేశ్వరం (Kaleshwaram) హీట్.. తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్టడీ చేయడం, ఓపెన్ కోర్టు విచారణ తర్వాత 650 పేజీల రిపోర్ట్ రెడీ చేయడం.. ఇందులో కేసీఆర్ (KCR) నిర్ణయాలే శాపంగా మారాయని తేల్చడంతో హైవోల్టేజ్ పొలిటికల్ హీట్ (Political Heat)ఖాయమే. ఒకపక్క అధికార కాంగ్రెస్ కాళేశ్వరం కూలేశ్వరం అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. నాణ్యత డొల్ల అని గట్టిగా వాదిస్తోంది. మరోపక్క ఇటీవల కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్ చెక్కు చెదరలేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా(Social Media)లో ఫోటోలు షేర్ చేసి హల్ చల్ చేసింది. కాళేశ్వరం విషయంలో గట్టిగానే వాదోపవాదాలు జరిగే అవకాశాలున్నాయి.
యూరియా కొరతపై గరం గరం
ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరత (Urea Shortage) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. పనులు మానేసి యూరియా కోసం రైతన్నలు గంటలతరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. అయినా సరిపడా యూరియా బస్తాలు ఇవ్వకపోవడంపై రోడ్డెక్కి రైతన్నలు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై కూడా సభలో తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. యూరియా కొరతపై బీఆర్ఎస్ కూడా అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు చేపడుతోంది. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. అయితే యూరియా కొరతకు మేము కారణం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రానికి సరైన కేటాయింపులు చేయలేదని ఆరోపిస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో రచ్చ జరిగే అవకాశం ఉంది.
బీసీలకు 42 శాతం కోటాపై
సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆర్డర్ ఉంది. మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ తెచ్చినా వాటికి రాష్ట్రపతి ఆమోదం లభించకుండా కేంద్రం అడ్డుకుందని, జీవో ద్వారా కూడా ఇచ్చి ప్రయత్నం చేద్దామన్న ఆలోచనను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చినా కోర్టులో నిలవదని, ఎన్నికలు జాప్యమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు. చివరకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే బీసీలను కులగణన, 42 శాతం రిజర్వేషన్లు, కమిషన్లు, బిల్లులు, ఆర్డినెన్సులతో మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. వీటిపై కాంగ్రెస్ కౌంటర్లు కూడా ఇస్తోంది. పార్టీ పరంగా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదో చెప్పాలని ప్రశ్నిస్తోంది.
భారీ వర్షాలతో నష్టాలపై వాడీవేడీ చర్చ
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంట, ఆస్తి నష్టం జరిగింది. వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిపై సభలో వాడి వేడి చర్చ జరిగే అవకాశాలున్నాయ్. అతి భారీ వర్షాలు కురుస్తాయని 72 గంటల ముందే భారత వాతావరణ శాఖ హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదన్న బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి, సహాయం కోసం ఆర్తనాదాలు చేసినా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు చేస్తుంది. వరద సహాయక చర్యల్లో పూర్తిగా రేవంత్ సర్కార్ విఫలమైందన్న వాదనను బీఆర్ఎస్ వినిపిస్తోంది. ఓవైపు వర్షాలు ఉంటే మరోవైపు సీఎం రేవంత్ మూసీ ఆధునికీకరణపై సమీక్షించడమేంటని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. దీన్నే సభలోనూ ప్రస్తావించే అవకాశం ఉంది.