తీగలా.. యమ పాశాలా..?

వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్లో కేబుల్, ఇంటర్నెట్ సేవలతో పాటు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న వైర్లు స్తంభం ఏ విభాగానికి చెందినదైనా తమ పనైపోవాలన్న చందంగా సర్వీస్ ప్రొవైటర్లు, ఇంటర్నెట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నందునే ఒక్కో స్తంభంపై వేల సంఖ్యలో వైర్లు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేయటం ఒక చిక్కు సమస్యగానే మారింది. ఇంటర్నెట్, టీవీ ఛానళ్ల ఆపరేటర్లు ఇష్టం వచ్చినట్లు కేబుళ్లు వేశారు.

వీధుల్లో ఏ స్తంభాన్ని చూసినా, కిలోల కొద్ది వైర్లు చుట్టి ఉంటాయి. వీటి బరువుతో స్తంభాలు కొన్ని వంగిపోవటంతో మరో రకం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. స్తంభం ఏదైనా దానిపై ఏర్పాటు చేసిన కరెంట్ వైర్ కాలం చెల్లి, ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తలెత్తితే, పోల్ పై ఉన్న కేబుళ్లన్నీ దగ్ధమవుతున్న ఘటనలు కోకొల్లలు. ఆ మంటలు సర్వసు వైర్ల నుంచి ఇంటికి, అపార్ట్మెంట్, షాపులకు విస్తరిస్తున్నాయి. మండే స్వభావం ఉన్న రసాయన పదార్థాలపై పడుతుండటంతో భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఇటు వినియోగదారులే గాకా, అటు డిస్కం నష్టాల పాలవుతున్నా, ఈ రకం ప్రమదాలకు చెక్ పెట్టేందుకు ఆ శాఖ కనీస ప్రయత్నం చేయకపోవటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

కొన్నేళ్లుగా విద్యుత్ తీగల తెగి పడటం, కేబుల్ వైర్లకు విద్యుత్ తీగల తగిలి రకరకాల ప్రమాదాలు చోటుచేసుకున్నా, విద్యుత్ శాఖలో విద్యుత్ స్తంభాలు, తీగల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వింగ్ ఏం చేస్తున్నట్టో..? అనే ప్రశ్న తలెత్తుతుంది. కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్స్ ఎక్కువగా స్తంభాలపై తీగలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి తీగలను ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినా, వినియోగదారుల నుంచి ఫిర్యాదులేమైనా వస్తేనే వీటి నిర్వహణను పట్టించుకుంటున్నారే తప్పా, కనీసం వర్షాకాలానికి ముందు ఈ వైర్లకు ఇంకెంత లైఫ్ ఉంది? అన్న విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నగరంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు సంస్థల పరిధిలోనే ఉంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఎవరికీ వారుగా తమకు కంపెనీకి చెందిన 40 నుంచి 50 తీగలను విద్యుత్ స్తంభాలకు వేలాడదీస్తూ ఒకసారి ఏర్పాటు చేసి తమ పనైపోయిందని భావిస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇష్టారాజ్యంగా కేబుళ్లు ఏర్పాటవుతున్నాయి. అక్రమంగా కేబుల్స్ ను ఏర్పాటు చేసిన ఆశాఖ మంచి కనీసం ప్రశ్నించే వారే కరువయ్యారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో కేబుళ్లు వివరీతంగా ఏర్పాటు చేస్తున్నారు.

టెలిఫోన్ స్తంభాలు, జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్ల స్తంభాలంటూ తేడా లేకుండా ఒక్కో పోల్స్ కు రకరకాల వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. గాలి దుమారానికి విద్యుత్ తీగలు తగిలినప్పుడు మెరుపులు వచ్చి అవి కేబుళ్ల మీద పడి, మంటలు వచ్చిన ప్రమాదాలు కూడా చాలానే ఉన్నాయి. గతంలో వర్షం కురిసినపుడు నాంపల్లి బస్టాపులో కరెంట్ తీగ తెగిపడి ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా జరిగింది. ఫ్లైఓవర్లపై తెగి పడిన కేబుల్, ఇంటర్నేట్ వైర్ల పైనుంచి ప్రయాణిస్తూ వాహనదారులు స్కిడ్ అయి పడిపోయి మృతి చెందిన ఘటనలూ లేకపోలేవు. గతంలో ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న కోర్టు.. వైర్లు, ఇతర తీగలు వేలాడకుండా, రోడ్లపై పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా వివిధ సర్కారు విభాగాలు తీసుకున్న చర్యలు మాత్రం అంతంత మాత్రమే. తాజాగా రామంతాపూర్ గోకుల్ నగర్ ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనతో మరోసారి సర్కారు శాఖల నిర్లక్ష్యం బయట పడింది. కృష్ణాష్టమి రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి అక్కడ వేలాడుతున్న తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో ఐదుగురు మృతిచెందారు.

Leave a Reply