ముందస్తు జాగ్రత్తలే వడదెబ్బ నుంచి రక్షణ…

ముందస్తు జాగ్రత్తలే వడదెబ్బ నుంచి రక్షణ…
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ (హీట్ స్ట్రోక్) బారిన పడకుండా ప్రజలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. ఈ జాగ్రత్తలే మనకు వడదెబ్బ నుంచి రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వడదెబ్బ నివారణకు సంబంధించిన జాగ్రత్తలతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం వేళల్లో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, బయటకు వెళ్లినప్పుడు తలపై రక్షణ కోసం టోపీ లేదా గొడుగు వంటివి ఉపయోగించాలని సూచించారు.
అదేవిధంగా తగినంతగా నీరు, ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తరచుగా తీసుకోవాలని.. వదులుగా ఉండే లేతరంగు కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రజా ప్రదేశాల్లో ఈ పోస్టర్లను ప్రదర్శించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు.
గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం.సుహాసిని, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
