Polling | ప్రజాస్వామ్య వ్యవస్థపై..

Polling | ప్రజాస్వామ్య వ్యవస్థపై..
Polling | నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో రెండోవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఓటింగ్ సరళిని గమనించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లతో మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ శాతం వివరాలను పోలింగ్ కేంద్రంలో ఉన్న ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 5,364 ఓటర్లు ఉన్నారని ఇప్పటి వరకు 3930 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారి కలెక్టర్ కు వివరించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా సాగుతున్నందుకు అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. పోలింగ్ ముగిసిన అనంతరం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ, ముఖ్యంగా ఉప సర్పంచ్ ఎన్నికల ఫలితాల లెక్కింపు అత్యంత పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ పత్రాల లెక్కింపు జరగాలని, ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రతి బ్యాలెట్ పత్రాన్ని సరిగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి బ్యాలెట్ పత్రం పై వేసిన ఓటు ఏ అభ్యర్థి గుర్తుకు చెందిందో ఖచ్చితంగా నిర్ధారించిన తర్వాత, ఆయా అభ్యర్థుల గుర్తుల వారీగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఆ ఓట్లను మాత్రమే వేయాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా, క్రమబద్ధంగా సాగాలని, దీనిని వీడియో చిత్రీకరణతో రికార్డు చేయాలని కూడా సూచించారు. ఈ విధంగా అన్ని నిబంధనలు పాటిస్తూ, న్యాయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
