ఆ ఛాన‌ల్ అధినేత‌పై కోన ర‌ఘుప‌తి ఫిర్యాదు…

ఆ ఛాన‌ల్ అధినేత‌పై కోన ర‌ఘుప‌తి ఫిర్యాదు…

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల భార్యల పట్ల అత్యంత హేయమైన, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఛానల్ అధినేత పై ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ, జర్నలిజం ముసుగులో రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.

రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణలకు, కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగించేలా ఉండటం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన అధినేతపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

ఇటువంటి ధోరణి మీడియా రంగానికే మచ్చ తెస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోన రఘుపతి తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ లీడర్ ఇనగలూరి మాల్యాద్రి, నర్రావుల వెంకట్రావు, సాంబ చెన్నకేశవ నాయుడు, ఎంపీపీ హరి కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply